తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మల్కాజిగిరి(Malkajgiri) ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మల్కాజిగిరి(Malkajgiri) ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి(Revanthreddy) బరిలో నిలిచి విజయం సాధించారు. ఇక్కడ ఎంపీగా గెలిచినందుకే పీసీసీ చీఫ్ అయ్యానని, ముఖ్యమంత్రి కూడా అయ్యానని రేవంత్ ప్రచారం చేస్తున్నరాఉ. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్ స్థానాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఈ లోక్ సభ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా 2008లో ఏర్పాటైంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన తొలినాళ్లలోనే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి మల్లారెడ్డి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ రెండుసార్లు, తెలుగుదేశం పార్టీ ఒకసారి గెలిచాయి. మల్కాజిగిరి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉంటుంది. 1965కు ముందు మల్కాజిగిరి గ్రామ పంచాయతీగా ఉండేది. 1985లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. నగర విస్తీర్ణం పెరుగుతూ పోవడంతో 2007లో మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు.
అభ్యర్థులవారీగా చూస్తే మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్యంగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డిని బరిలోకి దించింది. తొలుత చేవెళ్ల ఎంపీగా పోటీ చేయిస్తారని భావించినా మారిన సమీకరణాల వల్ల సునీతామహేందర్‌రెడ్డికి మల్కాజ్‌గిరి కేటాయించడం జరిగింది. సీఎం రేవంత్ 2019లో పోటీ చేసి ఇక్కడి నుంచి గెలవడంతో.. ఆయనకున్న సంబంధాల వల్ల, కాంగ్రెస్ గాలి కూడా వీస్తుండడంతో ఇక్కడ పాగావేయాల్సిందేనని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక బీజేపీ నుంచి ఈసారి కొత్తగా ఈటల రాజేందర్(Etala rajender) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ఈటల.. ఈసారి ఎంపీగా నిలబడి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన గత 25 ఏళ్లుగా మాల్కాజ్‌గిరిలోనే నివాసం ఉండడం, ఆయన వ్యాపారాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండడంతో ఇక్కడి ప్రజలతో కూడా సంబంధాలు ఏర్పాడ్డాయి. దేశంలో కూడా మోడీ గాలి బలంగా వీస్తుందని.. అటు మోడీ, ఇటు తన పరపతితో ఇక్కడ నెగ్గాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్‌గిరి నుంచి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారట.
ఇక బీఆర్‌ఎస్ రాగిడి లక్ష్మారెడ్డిని(Lakshmi reddy) మల్కాజ్‌గిరిలో దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. గత 25 ఏళ్ల నుంచి ఆయన ఇక్కడ తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇక్కడి ప్రజలతో రాగిడి లక్ష్మారెడ్డికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు నాన్‌లోకల్ అభ్యర్థులు.. ఇతను లోకల్ క్యాండిడేట్ కావడంతో రాగిడి లక్ష్మారెడ్డికి అడ్వాంటేజ్ ఉంది. పైగా మల్కాజ్‌గిరిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడింటికి ఏడు కూడా బీఆర్‌ఎస్సే గెలిచింది. ఇది కూడా తన గెలుపునకు కారణమవుతుందని భావిస్తున్నారు.