పాలమూరు(Palamuru) పార్లమెంట్‌ స్థానాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మొన్నటి ఎన్నికల్లో పాలమూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు హస్తానికే(Congress) చిక్కాయి. అన్ని నియోజకవర్గాల్లో కలిపి పాలమూరులో కాంగ్రెస్‌కు లక్ష ఓట్లకుపైగా మెజార్టీ ఉంది. సీఎం రేవంత్‌ నియోజకవర్గం కొడంగల్‌ కూడా మహబూబ్‌నగర్‌ ఎంపీ పరిధిలోనే ఉంది.

గులాబీ గుబాళిస్తుందా..? కమల వికాసం కానుందా?.. హస్తానికి చిక్కనుందా..?
పాలమూరులో ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టిన బీఆర్‌ఎస్‌
మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డీకే అరుణ, వంశీచంద్
ఈసారి డీకే అరుణ గెలిస్తే కేంద్ర మంత్రి పదవేనా..?
పాలమూరులో పాగా వేయాల్సిందేనంటున్న రేవంత్‌..!

పాలమూరు(Palamuru) పార్లమెంట్‌ స్థానాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మొన్నటి ఎన్నికల్లో పాలమూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు హస్తానికే(Congress) చిక్కాయి. అన్ని నియోజకవర్గాల్లో కలిపి పాలమూరులో కాంగ్రెస్‌కు లక్ష ఓట్లకుపైగా మెజార్టీ ఉంది. సీఎం రేవంత్‌ నియోజకవర్గం కొడంగల్‌ కూడా మహబూబ్‌నగర్‌ ఎంపీ పరిధిలోనే ఉంది. దీంతో ఈ ఎన్నికను సీఎం రేవంత్‌(CM Revanth reddy) కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి స్థానాన్ని వదులుకున్నారు. మహబూబ్‌నగర్‌ టికెట్ రావడంతో క్యాడరంతా కలిసి వంశీచంద్‌కు పనిచేస్తారని భావిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌ కూడా ఎలాగైనా ఈ సారి పాలమూరును ఒడిసి తన 'హస్తంలో' బంధించుకోవాలన్న కసితో ఆయన పనిచేస్తున్నారట. ఎందుకంటే రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు కావడమే కాకుండా ఆయన సొంత నియోజకవర్గం కూడా ఇక్కడే ఉండడంతో ఇక్కడ గెలిచి పాలమూరు ప్రజలు తనతోనే ఉన్నారన్న సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వాలని రేవంత్‌ ఉవ్విళ్లూరుతున్నారట.

మరోవైపు గత మూడు ఎన్నికల్లో కూడా ఇక్కడ గులాబీ(BRS) జెండానే రెపరెపలాడింది. 2009 ఎన్నికల్లో కేసీఆర్(KCR), 2014లో జితేందర్‌రెడ్డి, 2019లో కూడా మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. నాలుగో సారి కూడా పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని.. తద్వారా పాలమూరు ప్రజలు తమ వైపే ఉన్నారన్న సందేశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాల్ల కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచిన బీఆర్‌ఎస్‌.. ఎంపీని గెలుచుకొని తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవడంతో ఇక్కడ ఎలాగైనా గెలిచి తన పట్టునిలుపుకోవాలని చూస్తోంది. ఓడిన ఎమ్మెల్యేలు ఐక్యంగా కష్టపడితే గెలుపు పెద్ద విషయమేమీ కాదని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, 100 రోజుల్లో చేస్తామన్న హామీలు గాడిన పడకపోవడం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని గులాబీ నేతలు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ(Narendra modi) గాలీ మరోసారి వీయనుందని అన్ని సర్వేలు చెప్పడంతో ఈ ఎన్నికను బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ(DK ARUN) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో 78 వేల ఓట్ల తేడాతో డీకే అరుణ ఓడిపోయినప్పటికీ.. భారీగా ఓట్లు రాబట్టారు. 2018 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ.. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సారి బీజేపీకి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు కూడా వచ్చాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పాలమూరులో కమలాన్ని వికసింపజేయాలని గట్టి పట్టుతో ఉన్నారు. డీకే అరుణ భవిష్యత్‌ కూడా ఈ ఎన్నికపై ఆధారపడి ఉంది. ఈసారి ఆమె ఇక్కడ గెలిస్తే కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం కూడా ఉంది. దీంతో డీకే అరుణ కూడా ఈ ఎన్నికలో తన శక్తినంతా ధారపోస్తున్నారు.

అన్ని పార్టీలు అన్ని రకాలుగా ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రణాళికలు పన్నుతున్నాకానీ పాలమూరు ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి.

Updated On 15 March 2024 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story