మూసీ ప్రక్షాళన పేద ప్రజలకు నిద్రపట్టని రాత్రులను మిగులుస్తున్నాయి.
మూసీ ప్రక్షాళన పేద ప్రజలకు నిద్రపట్టని రాత్రులను మిగులుస్తున్నాయి. పండుగ రోజుల్లో వారు సంతోషంగా భోజనం కూడా చేయడం లేదు. ఇక హైడ్రానేమో(Hydra) మధ్య తరగతి ప్రజలకు హార్ట్‌బీట్ పెంచుతోంది. ఎక్కడ తమ నివాసాలు నేలమట్టం అవుతాయేమోనన్న బెంగతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ప్రజలలో ఉన్న సందేహాలను తీర్చే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెబుతున్న మాటలకు భట్టి చెబుతున్న మాటలకు పొంతన లేకపోవడం గమనార్హం. తాము బఫర్‌జోన్‌లోని(Buffer zone) ఇండ్ల జోలికి వెళ్లమని, ఎఫ్‌టీఎల్(FTL) పరిధిలో ఉన్న వాటిపై మాత్రమే దృష్టి పెట్టామని భట్టి చెప్పుకొచ్చారు. ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా రియల్‌ఎస్టేట్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది సందేహంగా ఉంది. నిర్మితమవుతున్న అనేక నివాసిత భవనాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారాయి. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మిస్తున్న కాండ్యూర్ స్కైలైన్, మియాపూర్‌లోని వెర్‌టెక్స్ విరాట్, పుప్పాలగూడలోని సమధుర పాలైస్ రాయలె, సైబర్‌సిటీ ఒరియానా, పూజా మ్యాజిక్ బ్రీజ్, ఎస్‌ఎమ్‌ఆర్ వినయ్ బౌల్డెర్ వుడ్స్, వజ్రమ్, హానెర్ సిగ్నేటిస్ భవనాల పరిస్థితిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇందులో కాండ్యూర్ స్కైలైన్‌లో మెజారిటీ భాగం ఎఫ్‌టీఎల్‌లో ఉంది. అలాగే మెర్‌టెక్స్ కూడా మెజారిటీ పోర్షన్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. సుమధుర కూడా అంతే! సైబర్‌సిటీ ఒరియానాలో ఓ టవర్ మొత్తం ఎఫ్‌టీఎల్‌లో ఉంది. పూజా మ్యాజిక్ పూర్తిగా ఎఫ్‌టీఎల్‌లో ఉంది. ఎస్‌ఎమ్ఆర్ వినయ్‌లో ఓ పెద్ద టవర్‌కు ప్రమాదం ఏర్పడింది. గోపన్నపల్లిలోని వజ్రం కూడా పూర్తిగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. హానెర్ విషయానికి వస్తే కొద్ది భాగం డేంజర్‌లో పడింది. ఇక కమర్షియల్ కాంప్లెక్స్‌ల విషయానికి వస్తే పుప్పాలగూడలోని ఫినెక్స్ 285 భవంతిలో చాలా భాగం ఎఫ్‌టీఎల్‌లో ఉంది. ఫినెక్స్ 25 -ట్రిటన్ అయితే పూర్తిగా ఎఫ్‌టీఎల్‌లోనే ఉంది. వైష్ణవీ సింబోల్ కూడా పూర్తిగా ఎఫ్‌టిఎల్‌లోనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లను ఏం చేస్తారన్న విషయాన్ని భట్టి విక్రమార్క్ చెప్పలేదు. ఆ నిర్మాణాలన్నింటికీ రెరా, హెచ్‌ఎమ్‌డీఏ అనుమతులు ఉండటం విశేషం. భవిష్యత్తులో జరిగే నిర్మాణాలకైనా జాగ్రత్తగా పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.