జీవో 29ను (GO-29)వెంటనే రద్దు చేయాలన్నది అభ్యర్థుల డిమాండ్‌.

గ్రూప్‌-1 మెయిన్ష్(Group-1 Mains) పరీక్షలను రీ షెడ్యూల్‌(exam rescheduling) చేయాలని, జీవో 29ను (GO-29)వెంటనే రద్దు చేయాలన్నది అభ్యర్థుల డిమాండ్‌. జీవో 29తో రిజర్వుడ్‌ కేటగిరి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందుకే పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అసలు అభ్యర్థుల ఆందోళన సహేతుకమేనా? నిజంగానే రిజర్వుడ్‌ కేటగిరి అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదా? ఇప్పుడు చూద్దాం. జీవో 55 ప్రకారం.. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను మల్టీజోన్‌ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్‌, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ తదితర కేటగిరిల్లో 1:​​50 నిష్పత్తిలో గుర్తించాలి. అంటే గతంలో 503 పోస్టులకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేపట్టారు. అంటే 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాలి. అయితే దివ్యాంగుల కేటగిరీలో రెండు పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో వంద మందిని తగ్గించి 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు. జీవో 29 ప్రకారం నేరుగా మల్టిజోన్‌ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఈ విధంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు రిజర్వుడ్‌ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, తర్వాతి మెరిట్‌ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల్లోని రూల్‌ 22, 22ఏ ఆధారంగా వీరి ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి.. జీవో 29 ఇచ్చారు. ఇక్కడే వివాదం మొదలయ్యింది. ప్రస్తుతం గ్రూప్‌–1 కేటగిరీలో మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. జీవో 55కు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడు జీవో 29 ప్రకారం ఎంపిక చేపట్టారు. అంటే నేరుగా మెరిట్‌ లిస్టులోని 28,150 మందిని ఎంపిక చేశారు. వీరిని ఓపెన్‌ కాంపిటీషన్, రిజర్వుడ్‌ కేటగిరీలు విభజించారు. అయితే, రిజర్వుడ్‌ కేటగిరీల్లో 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండటంతో.. కింది మెరిట్‌ ఆధారంగా అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే 28,150 మందికి మరో 3,233 మంది అదనంగా, అంటే 31,383 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తి కంటే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. పైగా రిజర్వుడ్‌ కేటగిరీలవారు చాలినంత మంది లేకపోవడమంటే.. ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టే అన్నది అభ్యర్థుల ఆందోళన. దాంతో పాటు ఇది రిజర్వేషన్లకు దెబ్బ! ఇదే విద్యార్థుల తీవ్ర ఆందోళనకు కారణమయ్యింది.

Eha Tv

Eha Tv

Next Story