హైదరాబాద్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది మధ్యాహ్నం సమయాల్లో బయటకు రావద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవడంతో తెలంగాణకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.
నిన్న కూడా హైదరాబాద్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. IMD హైదరాబాద్ ఏప్రిల్ 20 వరకు వడగాలులకు సంబంధించి హెచ్చరికలను జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం.. హీట్ వేవ్ హెచ్చరిక ఏప్రిల్ 20 వరకు అమలులో ఉంటుంది. తెలంగాణలోని పెద్దపల్లె, జె.భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, బి.కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.
తెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో వర్షం తెలంగాణ వాసులకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు. వరుణుడి రాకతో ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల సెల్సియస్ వద్దకి చేరే అవకాశం ఉంది.