బిత్తిరి సత్తి గీత వివాదం ....గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నాడా?
బిత్తిరి సత్తి(Bitthiri Sathi) అనవసరంగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భగవద్గీతను(Bhagavadgita) బిల్లు గీత పేరుతో బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్(Ravi kumar) ముదిరాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో(Social media) చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బిత్తిరి సత్తినే! ఈ వీడియోపై వానరసేన మండిపడింది. భగవద్గీతను బిత్తిరి సత్తి కించపరిచాడంటూ సైబర్ క్రైమ్‌లో కంప్లయింట్ చేసింది. ఆ వీడియో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని, అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వానరసేన(Vanarasena) జాతీయ అధ్యక్షుడు నామ్ రామ్‌రెడ్డి(Nam ram reddy) పేర్కొన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థలో గీత కూడా ఒక భాగమని ఆయన ఫిర్యాదులో తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime Police) కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అనవసరంగా బిత్తిరి సత్తి వానరసేనతో గెలుక్కున్నాడనిపించింది. రాష్ట్రీయ వానరసేనకు చెందిన ఓ వ్యక్తి బిత్తిరి సత్తికి ఫోన్ చేశాడు. తన పేరును కేశవరెడ్డి అని చెప్పుకున్నాడు. గీతను కించపరుస్తున్నావు, నీ పద్దతి బాగోలేదని కేశవరెడ్డి చెప్పగానే బిత్తిరిసత్తి గయ్యిమన్నారు. ఇగో పార్టీ పరంగా మాట్లాడొద్దు అంటూ దబాయించాడు. కేశవరెడ్డి స్పందిస్తూ తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, తమది హిందూ ఆర్గనైజేషన్ అని చెప్పుకొచ్చాడు. అప్పుడైనా బిత్తిరి సత్తి కాసింత తగ్గాల్సింది. కానీ కంప్లయింట్ ఇచ్చుకోపో నా మీద అంటూ రెచ్చిపోయాడు. మళ్లీ కొంచెం దారికి వచ్చి నేను హిందువును కానా మరి అని అంటూ అన్నీ నీకు చెప్పి చేయాలా? నీకు నచ్చకపోతే చూడకు, అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకో అని గట్టిగా చెప్పాడు. ఇద్దరి సంభాషణలు వింటుంటే అసలు బిత్తిరి సత్తికి ఏ మాట్లాడాలో అర్థం కానట్టు తోచింది. నీ పేరేంది..? నీ ఏజ్ ఏంది..? అంటూ ఏదేదో అడిగాడు. మధ్యలో చూడు కేశవ రెడ్డీ అని అంటే దానికి కేశరెడ్డి , అవును రవి ముదిరాజ్ అని రిటార్ట్ ఇచ్చాడు. అనవసరంగా కులాల ప్రస్తావన తెచ్చినట్టుగా అనిపించడం లేదూ! బ్లాక్ చేయి, డిలిట్ చేయి, చూడకు అంటూనే అందరికీ అందరూ వస్తారు అని బిత్తిరి సత్తి అన్నాడు. అంటే తనకు ఇంకేదో కమ్యూనిటీ సపోర్టుగా వస్తుంది అని చెప్పడమా? పైగా నేను శ్లోకాలు పాడుతా, నువ్వు పాడు అని సవాల్ విసరడం ఎందుకు? మొత్తం మీద వివాదాన్ని బిత్తిరి సత్తే పెద్దగా చేసుకుంటున్నాడు. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నాడా? ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.