తెలంగాణ రాజకీయాలు చిత్రాతిచిత్రంగా ఉన్నాయి. ఎవరు ఎవరితో అంటకాగుతున్నారో, ఎవరు ఎవరిని రహస్యంగా కలుస్తున్నారో అర్థం కానీ పరిస్థితి
తెలంగాణ రాజకీయాలు చిత్రాతిచిత్రంగా ఉన్నాయి. ఎవరు ఎవరితో అంటకాగుతున్నారో, ఎవరు ఎవరిని రహస్యంగా కలుస్తున్నారో అర్థం కానీ పరిస్థితి. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) మధ్య క్విడ్ ప్రోకో ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao)రహస్యంగా భేటీ అయ్యారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఆర్‌కెహెచ్ అంటే రేవంత్‌రెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు మధ్య పంచాయితీ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడి కొలువులో ఉండేవాడు సంజయుడు. మహాభారత యుద్ధ సమయంలో ధృతరాష్ట్రుడికి తన దివ్యదృష్టి ద్వారా యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తూ వచ్చాడు. సంజయుడిలా మన బండి సంజయ్‌కు కూడా దివ్యదృష్టితో రేవంత్-హరీశ్ కలిసింది చూశారేమో! మరో చిత్రమేమిటంటే ఇదే హరీశ్‌రావు ఇదే రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు గుప్పించడం. రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిగా పని చేస్తున్నారని హరీశ్‌రావు చేసిన కామెంట్‌ను దృష్టిలో పెట్టుకుని బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేశారనుకోవాలి. మొత్తం మీద తెలంగాణ(Telangana)లో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయన్నది గులాబీ పార్టీ కంప్లయింట్. కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనన్నది బీజేపీ ఆరోపణ. బీజేపీతో బీఆర్‌ఎస్ అంటకాగుతున్నదన్నది రేవంత్‌రెడ్డి తరచూ చేస్తున్న ఆరోపణ! ఇంత కన్‌ఫ్యూజన్ పాలిటిక్స్ మరెక్కడా ఉండవేమో!