ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ నాగమణి హత్య సంచలనం రేపింది.
ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ నాగమణి హత్య సంచలనం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే గొంతు కోసి హత్య చేశాడు. నాగమణి కులాంతర వివాహం చేసుకున్నది కాబట్టి మొదట ఇది పరువు హత్య అని అనుకున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు కారణం ఆస్తి గొడవలే అని తేలింది. రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది. నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ మొదట ఆమెను కారుతో ఢీకొట్టాడు. తర్వాత కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది నాగమణి. ఇటీవలే శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకున్న నాగమణి భూమిలో వాటా కావాలంటూ తమ్ముడిని ఒత్తిడి చేసిందట! అందుకే పరమేస్ ఆమెను హత్య చేశాడని పోలీసులు అంటున్నారు.