సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా.. మొదటి సారిగా మిగతా రూట్లలోనూ ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.

TSRTC to introduce electric buses to distant areas, confirms Sajjanar
సుదూర ప్రాంతాలకు త్వరలోనే ఎక్స్ ప్రెస్(Express), డీలక్స్(Deluxe), సూపర్ లగ్జరీ(Super Luxury) ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం విజయవాడ(VIjayawada) మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా.. మొదటి సారిగా మిగతా రూట్లలోనూ ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. ఇప్పటికే 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ.. వాటిలో కొన్నింటిని డిసెంబర్ లో వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది.
అందులో భాగంగానే హరియాణా పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్(VC Sajjanar) స్వయంగా పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన తనిఖీ చేశారు. టీఎస్ఆర్టీసీకి అందిస్తోన్న రెండు ప్రొటో(నమూనా) బస్సులను పరిశీలించారు. జేబీఎం గ్రూప్(JBN Group) 500 ఎలక్ట్రిక్ బస్సులను ఒప్పందం ప్రకారం టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది. వాటిని విడతల వారీగా ఆ కంపెనీ అందించనుంది. డిసెంబర్ లో కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యాధునిక హంగులతో ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తీసుకువస్తుందని సజ్జనర్ అన్నారు.
ఈ బస్సుల్లో ప్రయాణికులను లెక్కించే సదుపాయంతో పాటు భద్రతకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్)ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుందని, గమ్యస్థానాల వివరాల కోసం బస్సులో ఎల్ఈడీ బోర్డులుంటాయని పేర్కొన్నారు.
