గత కొంత కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి(CMrevanth reddy) తెలంగాణలో నాలుగో నగరాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు

గత కొంత కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి(CMrevanth reddy) తెలంగాణలో నాలుగో నగరాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. దానికి క్యాచీ నేమ్‌ 'ఫ్యూచర్‌ సిటీ'(Future city) అని పేరు పెట్టారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శ్రీశైలం హైవేలోని ముచ్చెర్ల, మీర్‌ఖాన్‌పేటతో పాటు పది గ్రామాలున్న ఈ ప్రాంతంలో ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని తలపెట్టింది. గత ప్రభుత్వం ముచ్చర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ కోసం 10 వేల ఎకరాలను సేకరించి పెట్టింది. ఈ పదివేల ఎకరాలను ఎనిమిది జోన్లుగా విభవించి ఫ్యూచర్‌ సిటీ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్‌ సైన్సెస్, స్పోర్ట్స్ హబ్, హెల్త్‌ సిటీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్‌ అండ్ స్కిల్‌ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ సిటీ నిర్మాంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

రెసిడెన్షియల్‌ జోన్‌కు 1,170 ఎకరాలు కేటాయించి, అత్యధికంగా లైఫ్ సైన్సెస్ హబ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌లకు ఏకంగా 8 వేల ఎకరాలు కేటాయించారు. ఇందులో లైఫ్ సైన్సెస్ హబ్‌కు 4,207 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ జోన్‌కు 3,642 ఎకరాలు కేటాయిస్తారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి ప్యూచర్‌ సిటీకి చేరుకునేందుకు రోడ్డు, మెట్రో రైలు కనెక్టివిటీని కల్పించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్‌ను 225 ఎకరాల్లో నిర్మిస్తారు. స్పోర్ట్స్ క్లబ్‌ను 258 ఎకరాల్లో, హెల్త్ సిటీని 116 ఎకరాల్లో, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌ను 336 ఎకరాల్లో నిర్మిస్తారు. ఇందులో భాగంగా ఇక్కడ మల్టీప్లెక్స్‌లు, పార్కులు, హోటళ్లు నిర్మిస్తారు.

అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్ తరహాలో ఇక్కడ కూడా ఒక ట్రేడ్ సెంటర్ నిర్వహించాలని నిర్ణయించారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ప్రతినిధులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో దీని నిర్మాణంపై అధికారులు అన్వేషిస్తున్నారు. ఎయిర్‌పోర్టు, మెట్రోస్టేషన్‌ నుంచి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కు సులభంగా చేరుకునేలా అనువైన 50 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ప్రతినిధులు కోరారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఈ ప్రతిపాదిత ఫ్యూచర్‌ సిటీకి మంచి ఫ్యూచర్‌ ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ఇక్కడ మరోరకంగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఫార్మా(Pharma company) రంగం కోసం రైతుల నుంచి భూమి సేకరించింది. ఫార్మా రంగం కోసమే భూసేకరణ అంటూ నోటిఫికేషన్‌ ఇచ్చి, రైతుల నుంచి దాదాపు 10 వేల ఎకరాలు సేకరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు అని ఒకసారి, లేదు గ్రీన్ ఫార్మా సిటీ అని మరొకసారి ప్రకటించారు. దీంతో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఫార్మా సిటీ కోసం తమ భూములు సేకరించారని, ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ అంటూ ప్రకటనలు ఇస్తున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత కోరింది. ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నారా లేదా అని స్పష్టంగా చెప్పాలని కోరింది. దీంతో ఇప్పుడు అధికారులు కోర్టుకు వివరణ ఇవ్వడంపై దృష్టిపెట్టారు. అయితే అన్నీ సక్రమంగా సాగి ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం సవ్యంగా సాగితే మంచి ఫ్యూచరే ఉంటుందని రియల్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story