మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency)..రంగారెడ్డిజిల్లాలోనే(Ranga reddi) హాట్ సీట్‎గా ఉంది. మహేశ్వరం సీటుపై కన్నేసిన అధికార, విపక్ష పార్టీల నేతలు.. నువ్వా-నేనా అన్నట్టు నియోజకవర్గంపై పట్టు సాధించే పనిలోపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి(Sabitha Indra Reddy)..మరోసారి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే సొంత పార్టీలోనే మొదలైన వర్గపోరు మంత్రికి తలనొప్పిగా మారింది.

మహేశ్వరం నియోజకవర్గం(Maheshwaram Constituency)..రంగారెడ్డిజిల్లాలోనే(Ranga reddi) హాట్ సీట్‎గా ఉంది. మహేశ్వరం సీటుపై కన్నేసిన అధికార, విపక్ష పార్టీల నేతలు.. నువ్వా-నేనా అన్నట్టు నియోజకవర్గంపై పట్టు సాధించే పనిలోపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి(Sabitha Indra Reddy)..మరోసారి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే సొంత పార్టీలోనే మొదలైన వర్గపోరు మంత్రికి తలనొప్పిగా మారింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్(Congress), బీజేపీల(BJP) నుంచి కూడా ఆశావాహుల సంఖ్య చాలానే ఉంది. దీంతో ఎన్నికలకు ముందే మహేశ్వరం రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారి గులాబీ జెండా ఎగిరే ఛాన్స్ ఉందా? ఓవరాల్ గా అక్కడ ఎలాంటి సీన్ కనిపించబోతోంది? ఇలాంటి అంశాలను మీ నియోజకవర్గం.. మా విశ్లేషణలో చూద్దాం.

2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. దీని పరిధిలో.. కందుకూరు, మహేశ్వరం మండలాలతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ(Tukkuguda Municipality), గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సరూర్‌నగర్ ప్రాంతం కొంత కలిసి ఉంటుంది. గ్రామీణం, పట్టణం, ఇంకొంత నగరం.. ఇలా 3 రకాల ప్రాంతాలు కలిసుండే నియోజకవర్గం మహేశ్వరం. వీటిలో.. కందుకూరు మండలం గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మహేశ్వరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సాఫ్ట్‎వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, ఫ్యాబ్‎సిటీ, అమెజాన్ డాటా సెంటర్, సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్‎పోర్టుతోపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు.. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి.

మహేశ్వర నియోజకవర్గం ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో 3 లక్షల 80 వేల మందికి పైనే ఓటర్లు(Voters) ఉన్నారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య 4 లక్షలు దాటే అవకాశం ఉంది. మహేశ్వరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో తొలిసారి కాంగ్రెస్(Congress) నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి(Thigala Krishna Reddy).. టీడీపీ(TDP) తరఫున గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. మహేశ్వరంపై తన పట్టు నిలుపుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. తర్వాత.. ఆవిడ బీఆర్ఎస్‌లో చేరడం, సీఎం కేసీఆర్(CM) క్యాబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకోవడం జరిగాయి.

మహేశ్వరం.. మంత్రి సబిత సొంత నియోజకవర్గం కాకపోయినా.. ఆవిడ ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆమెకు ప్రస్తుతం మహేశ్వరంలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి, మంత్రి సబితకు అస్సలు పొసగడం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలో తీగల వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి మధ్య వర్గపోరు, ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. దీనిపై పలుమార్లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా సబిత తనయుడు కార్తీక్ రెడ్డి(Karthik Reddy) భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ తీగల కృష్ణారెడ్డితోపాటు కొత్త మనోహర్‎రెడ్డి బహిరంగనే విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు, దళితులకు సంబంధించిన అసైన్ మెంట్ భూములను మంత్రి ఇంద్రారెడ్డి, ఆమె అనుచరులు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కబ్జాలపై ప్రతిపక్ష బీజేపీ(BJP) ఆందోళనలు కూడా చేపట్టింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి పార్టీలో కొనసాగుతారా..? కొనసాగిన సబిత విజయానికి పని చేస్తారా లేదా అన్నది అనుమానంగానే ఉంది.
దీంతో ఈసారి ఎన్నికల్లో సబితకు సొంత పార్టీ నుంచే అసమ్మతి తలనొప్పిగా మారింది.

మరోవైపు మహేశ్వరంలో పాగా వేయాలని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహేశ్వరంలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ.. వాళ్లిద్దరూ.. గెలిచాక అధికార బీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పుడు కూడా మంత్రి సబిత బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నా.. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ప్రధానంగా ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. బడంగ్‎పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డికి ఇక్కడి నుంచి టికెట్ రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న పీసీసీ(PCC) చీఫ్ రేవంత్‎రెడ్డి హామీతోనే.. బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారనే ప్రచారం సాగుతోంది. సరూర్‌నగర్‌కు చెందిన దేప భాస్కర్‎రెడ్డి(Deepa Bhaskar Reddy) కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌తో(Revanth Reddy) తనకున్న సన్నిహిత సంబంధాలు కలిసొస్తాయని అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. చల్లా నర్సింహరెడ్డి, ఎలిమేటి అమరేందర్ రెడ్డి, కొత్త మనోహర్‎రెడ్డి, జమలాపురం శ్రీనివాసరావు, అనుగు జంగారెడ్డి. బంగారు బాబు తదతిర నేతలు ఇక్కడి నుంచి టికెట్ కేటాయించాలంటూ దరఖాస్తులు చేసుకున్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో ఈ మధ్య బీజేపీ బలం బాగా పుంజుకుంది. ఇప్పటికే.. తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో సరూర్‌ నగర్ డివిజన్‌ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దాంతో.. రాబోయే ఎన్నికలపై బీజేపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్‌‎ ఇక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఇటీవల పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కార్తీక్ రెడ్డి దళితుల భూములను కబ్జా చేశారంటూ ఆందోళనలకు దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీ కేడర్ ను సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తున్నారు అందె శ్రీరాములు. ఇక ఇక్కడి నుంచి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఇటీవలే వీరేందర్ గౌడ్ కూడా యాక్టివ్ అయ్యారు. అయితే.. గత ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేయడంతో.. ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో పోటీ చేసి ఓడినా నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న అందెల ఈసారి హైకమాండ్ ఖచ్చితంగా తనకు సీటు కేటాయిస్తుందనే ధీమాతో ఉన్నారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సబిత పేరు ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి.
మరోవైపు కొద్దిరోజుల్లోనే ఇటు కాంగ్రెస్,అటు బీజేపీలు అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. తాజా పరిస్థితులను చూస్తే.. మహేశ్వరంలో త్రిముఖ పోరు తప్పదనే చర్చ నడుస్తోంది. అన్ని అస్త్రాలతో అధికార పార్టీ రేసులో ముందున్నా.. ఎన్నికల నాటికి లోకల్ ఫ్యాక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్ప.. మిగతా నాయకులంతా మహేశ్వరం నియోజకవర్గానికే చెందినవారు కావడం లోకల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. దాంతో.. ఆవిడ మహేశ్వరం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. రాజకీయంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక్తిగా రేపుతోంది. మొత్తంగా.. ఈసారి మహేశ్వరంలో ఎలాంటి సీన్ ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 22 Sep 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story