ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. రాష్ట్ర రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు. హైదరాబాద్ మహానగరంలోని కీలకమైన స్థానాల్లో కీలక నియోజకవర్గం. ఎందరో రాజకీయ ఉద్దండులకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆ నియోజకవర్గం మలక్‎పేట(Malakpet Constituency). ఒకప్పుడు కాంగ్రెస్(Congress), ఆ తర్వాత బీజేపీకి(BJP) కంచుకోటగా ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎంఐఎం(MIM) పార్టీకి అడ్డాగా మారిపోయింది. తమ పార్టీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఇటు కాంగ్రెస్..అటు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. అయినా విపక్షాల పాచికలు ఏ మాత్రం పారడం లేదు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. రాష్ట్ర రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు. హైదరాబాద్ మహానగరంలోని కీలకమైన స్థానాల్లో కీలక నియోజకవర్గం. ఎందరో రాజకీయ ఉద్దండులకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆ నియోజకవర్గం మలక్‎పేట(Malakpet Constituency). ఒకప్పుడు కాంగ్రెస్(Congress), ఆ తర్వాత బీజేపీకి(BJP) కంచుకోటగా ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎంఐఎం(MIM) పార్టీకి అడ్డాగా మారిపోయింది. తమ పార్టీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఇటు కాంగ్రెస్..అటు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. అయినా విపక్షాల పాచికలు ఏ మాత్రం పారడం లేదు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

హైదరాబాద్‎లోని 15 నియోజకవర్గాలలో మలక్‎పేట్ సెగ్మెంట్ ఒకటి. మ‌ల‌క్‎పేట్ నియోజ‌క‌వ‌ర్గానికి రాజ‌కీయంగా ఎంతో ఘన చ‌రిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాల కేంద్రంగా ఉండేది ఈ నియోజ‌క‌వ‌ర్గం. గతంలో మీర్ అహ్మద్ అలీఖాన్ రెండుసార్లు, జి. స‌రోజిని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్.ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు, మల్‎రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. మల్‎రెడ్డి రంగారెడ్డి ఒకసారి టీడీపీ తరఫున, మరోసారి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. సరోజిని పుల్లారెడ్డి, మీర్ అహ్మద్ అలీఖాన్, కందాల ప్రభాక‌ర్‎రెడ్డిలు మంత్రి పదవులు నిర్వహించిన వారిలో ఉన్నారు. కందాల ప్రభాకర్‎రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా చేసారు. జనతా పార్టీ పక్షాన గెలిచిన ఈయన తర్వాత కాంగ్రెస్‎లో చేరారు. 1989లో ఇక్కడ గెలుపొందిన సుధీర్‎కుమార్ కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు.

1967లో హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‎గా గెలిచిన స‌రోజిని పుల్లారెడ్డి ఆ తర్వాత కాలంలో మలక్‌పేట్ ఎమ్మెల్యేగా గెలిచి నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్‎లో మంత్రిగా పనిచేశారు. మ‌ర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజ‌య్య, భ‌వ‌నం వెంక‌ట్రామ్, కోట్ల విజ‌య‌భాస్కర్‎రెడ్డి కేబినెట్‎లలో కీలక‌ మంత్రిగా ప‌నిచేశారు సరోజని పుల్లారెడ్డి. 1978లో సరోజిని పుల్లారెడ్డిపై జ‌నతా పార్టీ అభ్యర్థిగా గెలిచిన కందాల ప్రభాక‌ర్ రెడ్డి.. తర్వాత‌ కాంగ్రెస్‎లో చేరి రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడి నుంచి BJP తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన న‌ల్లు ఇంద్రసేనా రెడ్డి అనేక రికార్డులను బ్రేక్ చేశారు. తొలిసారి 1983లో అప్పటి హోంమంత్రి ప్రభాక‌ర్‎రెడ్డిని ఓడించిన ఇంద్రసేనారెడ్డి.. రెండోసారి మాజీ CM నాదెండ్ల భాస్కర్రావును ఓడించారు. ఇంద్రసేనారెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆయన తర్వాత మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకసారి టీడీపీ తరఫున, రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

మలక్ పేట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరుసార్లు, బీజేపీ మూడుసార్లు, మజ్లిస్ మూడుసార్లు, పీడీఎఫ్, జనతా, టీడీపీలు ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ ఎనిమిదిసార్లు రెడ్లు, ఆరుసార్లు ముస్లింలు, ఒకసారి బీసీ (మున్నూరు కాపు) నేతలు గెలుపొందారు. 2009లో పునిర్విభజన తర్వాత ఎంఐఎం అడ్డాగా మారిపోయింది. వరుసగా మూడు ఎన్నికల్లోనూ విజయం సాధించిన ఎంఐఎం నేత అహ్మద్ బిన్ అబ్దుల్లా బ‌లాలా.. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోసారి బలాల ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా(Ahmed Balala) సీటుకు ఎసరు పెట్టేందుకు విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈసారి అంగ బలం, ఆర్థిక బలమున్న మైనార్టీ(Minorities) వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన గూగీ ప్రాపర్టీస్ ఎండీ షేక్ అక్బర్‎కు(Sheikh Akbar) టికెట్ కేటాయించింది. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ షేక్ అక్బర్ మలక్‎పేట్‎లో గెలిచి తీరుతానన్న ధీమాతో ఉన్నారు. ఈసారి మలక్‌పేట రాజకీయం మొత్తం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌నకు ముందు మలక్‌పేట్ నియోజ‌వ‌ర్గం హైదరాబాద్ నగరంతోపాటు..రూరల్ ప్రాంతంలో విస్తరించి ఉండేది. ఆజంపురా, అక్బర్‎బాగ్, చాదర్‎ఘాట్, ఓల్డ్ మ‌ల‌క్ పేట్, ముస‌రాంభాగ్, సైదాబాద్, చంచ‌ల్‎గుడా డివిజ‌న్‎ల‌తోపాటు… బాట సింగారం, హ‌య‌త్‎న‌గ‌ర్, స‌రూర్ న‌గ‌ర్, జ‌ల్‎ప‌ల్లి, ప‌హాడి ష‌రిఫ్‎లో కొంత ప్రాంతం, రాగ‌న్నగూడ‌, నాద‌ర్‎గుల్ ప్రాంతాల్లో ఓటర్లు ఉండేవారు. నగరంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నా.. రూరల్ ప్రాంతంలో ఉన్న ఓట్లతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వచ్చారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ఎంఐఎంకి బాగా కలిసి వచ్చింది. 2009 తర్వాత గ్రామీణ ప్రాంతాలు అన్నీ మలక్‌పేట నుంచి వేరుపడ్డాయి. పూర్తిగా నగరం పరిధిలో ఉన్న మైనార్టీ ప్రాంతమే ఎక్కువగా ఈ నియోజవర్గంలో కలవడంతో ఎంఐఎంకు గెలుపు ఈజీ అయ్యింది.

ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2 లక్షల 61 వేల 705 ఓట్లు ఉన్నాయి. సైదాబాద్, ముస‌రాం భాగ్, అక్బర్ బాగ్‌ల్లో హిందు ఓటు బ్యాంక్ ఉన్నప్పటికి మిగ‌తా డివిజ‌న్‎లలో 90 శాతం ఓట్లు ముస్లిం మైనారిటీలు ఉన్నారు. దీంతో ఇక్కడ ఎంఐఎంకు గెలుపు నల్లేరుపై నడకగా మారింది. చంచ‌ల్‎గూడలో 49 వేల ఓట్ల ఉంటే.. హిందువుల ఓట్లు కేవ‌లం 830 మాత్రమే. మైనారిటీలు ఎక్కువగా ఉండటంతో ఎంఐఎంకి పోటీగా ఇతర పార్టీలు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులనే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. బీజేపీ తరపున సిట్టింగ్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీంద్రారెడ్డి(Ravindhra Reddy) పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బ‌లాలా(Ahmad bin Abdul Balala) తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీలో బలాలాకు వ్యతిరేకంగా ఎలాంటి గ్రూపుల బెడద లేదు. నిత్యం ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండటం కూడా ఎమ్మెల్యేకు అనుకూల‌మైన అంశంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా బ‌లాలా వద్దని పార్టీ అధినేత ఒవైసీ భావిస్తేనే ఇక్కడ అభ్యర్థి మార్పు జరగొచ్చు. పార్టీ కార్యకర్తలతోపాటు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌తో మంచి రిలేష‌న్స్ ఉండ‌టంతో ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌లాల‌నే బరిలోకి దింపుతోంది.

ఎంఐఎంను ఢీకొట్టాల‌ని ఈ సారి కాంగ్రెస్, బీజేపీ పావులు క‌దుపుతున్నాయి. గ‌తంలో గెలిచిన అసెంబ్లీ కావ‌డంతో ఆ రెండు పార్టీలు ఆశ‌లు పెట్టుకున్నాయి. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో ఇక్కడి నుంచి TDP అభ్యర్థిగా.. మహ్మద్ ముస‌ఫ‌ర్ అలీఖాన్ పోటీచేసి 30 వేల ఓట్లు ద‌క్కించుకున్నారు. BJP నుంచి టైగ‌ర్ న‌రేంద్ర కుమారుడు ఆలే జితేంద్ర పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి హిందు ఓటు బ్యాంక్ చీల‌కుండా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తేనే ఎంఐఎంపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక BRSకు మిత్రప‌క్షంగా ఉన్న ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అదే జ‌రిగితే మ‌ల‌క్‎పేట్ బ‌రిలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి సైతం ఉండే అవ‌కాశం ఉంది. మైనార్టీ ఓట్లను బీఆర్ఎస్ చీల్చే చాన్స్ కనిపిస్తోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే ఎంఐఎం ఆధిపత్యానికి గండిపడటం ఖాయం. ఈ ఈక్వేషన్స్ అన్నీ పరిశీలిస్తే.. MIM, BRS మధ్య పొత్తు లేకపోతే ఎన్నిక రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. BRS పోటీలో ఉన్నా లేకపోయినా మలక్‌పేటలో రాజకీయం మొత్తం మూడు పార్టీల మధ్యే నడుస్తోంది. ఎంఐఎం జోరుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. చివరికి ఓటరు దేవుడు ఎవరి ఆదరిస్తారో చూడాల్సిందే.

Updated On 5 Nov 2023 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story