సిరిసిల్ల(Sircilla)..పేరులోనే సిరి..రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఏమైనా మార్పు జరిగిందా? ముఖ్యంగా చేనేత కార్మికుల బతుకు చిత్రం ఎలా ఉంది? ఇక్కడ విపక్షాలకు స్థానం లేకుండా వరుస విజయాలతో మంత్రి కేటీఆర్(KTR)..జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు.

సిరిసిల్ల(Sircilla)..పేరులోనే సిరి..రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఏమైనా మార్పు జరిగిందా? ముఖ్యంగా చేనేత కార్మికుల బతుకు చిత్రం ఎలా ఉంది? ఇక్కడ విపక్షాలకు స్థానం లేకుండా వరుస విజయాలతో మంత్రి కేటీఆర్(KTR)..జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్(Congress) తరఫున మరోసారి కేకే మహేందర్‎రెడ్డి(KK Mahender Reddy) అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. కమలం పార్టీ అభ్యర్థిగా రాణిరుద్రమ బరిలోకి దిగుతున్నారు. మరి సిరిసిల్లలో విపక్షాల వ్యూహాలు బెడిసికొట్టడానికి కారణం ఏమిటి? అభివృద్ధితో సవాల్ చేస్తున్న కేటీఆర్‎ను ఢీకొట్టేదెవరు? సిరిసిల్లలో కనిపిస్తున్న పొలిటికల్ సీనేంటో ఇప్పుడు చూద్దాం.

సిరిసిల్ల నియోజకవర్గం(Sircilla Constituency) 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మూడుసార్లు, కమ్యూనిస్టులు 4 సార్లు, టీడీపీ(TDP) ఒకసారి, బీఆర్ఎస్(BRS) నాలుగుసార్లు, ఒకసారి ఇండిపెండెంట్‎ గెలిచారు. 2009లో తొలిసారి ఇక్కడి నుంచి టీఆర్ఎస్(TRS) అభ్యర్థిగా కేటీఆర్(KTR) విజయం సాధించారు. అప్పుడు కేవలం 171 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై గెలిచారు. తర్వాత.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో(By Elections) భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఒకప్పుటి సిరిసిల్ల కాస్త.. రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారిపోయింది. మంత్రి కేటీఆర్
సారథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది.

సిరిసిల్ల నియోజకవర్గం అంటేనే వెంటనే గుర్తుకొచ్చేది చేనేత కార్మికులు(Handloom workers). రాష్ట్రం ఏర్పాటు కావడం, కేటీఆర్ ప్రాతినిథ్యం వహించడంతో సిరిసిల్ల దశ తిరిగింది. శ్రీరాజరాజేశ్వర, అన్నపూర్ణ ప్రాజెక్టులతోపాటు మల్కపేట రిజర్వాయర్‌తో బంగారు పంటలకు నెలవుగా మారింది. మొత్తం 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక, చేనేత, విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులతో సిరిసిల్ల నంబర్‌ వన్‌గా నిలిచింది. మొత్తంగా సిరిసిల్ల.. సిరులఖిల్లాగా మారింది. మౌలిక వసతుల కల్పనపైనా కేటీఆర్ దృష్టి పెట్టారు. నర్సింగ్ కాలేజీతోపాటు గంభీరావుపేటలో కేజీ టు పీజీ స్కూల్‌ని, జయశంకర్ అగ్రికల్చర్ విద్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఇక సిరిసిల్లకు కాళేశ్వరం జలాలు అందించేందుకు నిర్మిస్తున్న 9వ ప్యాకేజీ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

మంత్రి కేటీఆర్‎ది వెలమ సామాజికవర్గం. ఈ సామాజికవర్గం నేతలే అత్యధికంగా 13 సార్లు గెలుపొందగా, ఒకసారి రెడ్డి, రెండుసార్లు ఎస్సీ, ఒకసారి బ్రాహ్మణ వర్గం నేత ఎన్నికయ్యారు. ఇక ఏపీ, తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి కుమారుడు అదే క్యాబినెట్‎లో ఉండటం కేటీఆర్‎తోనే ఆరంభమైందనే చెప్పాలి. అలాగే 2018లో ఒకే కుటుంబం నుంచి కేసీఆర్(KCR), కేటీఆర్, కవిత(Kavitha).. ముగ్గురు పోటీ చేసి గెలుపొందడం కూడా మరో విశేషం. ఒకప్పుడు హైదరాబాద్‎కు చెందదిన సలావుద్దీన్ ఒవైసీ కుటుంబంలోని ముగ్గురికి ఇలాంటి గౌరవం దక్కింది. తారాక రామారావు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తండ్రి తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత, కొన్నేళ్లకే ఉద్యోగం మానేసి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‎కు చెక్ పెట్టాలన్న విపక్షాల వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏ మాత్రం పని చేయడ లేదు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి ప్రతి ఎన్నికల్లో కేటీఆర్‌కు ప్రత్యర్థిగా నిలుస్తూ వస్తున్నారు. 2009 నుంచి కేటీఆర్‌పై పోటీ చేస్తున్న మహేందర్ రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్‌లో సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఓ వైపు రాష్ట్రంలో హస్తం పార్టీ దూకుడుగా వెళ్తుంటే.. సిరిసిల్లలో మాత్రం గ్రాఫ్ పడిపోతోందనే వాదన వినిపిస్తోంది. అయితే మరోసారి సిరిసిల్ల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేకే మహేందర్‎రెడ్డి.. పరిస్థితులు ఎలా ఉన్నా ఈసారి గెలుపు తనదేనంటున్నారు

ఇక స్థానిక బీజేపీ(BJP) నేతలకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ మహిళా నేత రాణిరుద్రమకు(Ranirudrama) టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ కోసం పోటీపడిన నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, రెడ్డబోయిన గోపి, అడ్వకేట్ రమాకాంత్‎రావు, చేనేత సామాజికవర్గానికి చెందిన లగిశెట్టి శ్రీను టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే టికెట్ ఆశించి భంగపడిన ఆవునూరి రమాకాంత్(Aavunuri Ramakanth) ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికార బీఆర్ఎస్‌లో(BRS) చేరారు. నేత సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి బీజేపీ రెబెల్‎గా బరిలోకి దిగుతానంటున్నారు. స్థానిక నాయకులతో చర్చించకుండా ఏకపక్షంగా స్థానికేతర నేత రాణిరుద్రమకు టికెట్ ఎలా ఇస్తారని వారు ఆరోపిస్తున్నారు. ఈసారి అసంతృప్త నేతలతో పార్టీకి తలనొప్పులు తప్పేలా లేదు.

సిరిసిల్ల నియోజకవర్గం మొత్తం 2 లక్షల 8 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో నేతన్నల ఓట్ బ్యాంక్ 22 వేలకు పైనే ఉంది. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేది నేతన్నలే. ఆ తర్వాత.. గౌడ, మున్నూరు కాపు, ముదిరాజ్, రెడ్డి సామాజికవర్గాల ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. ఇక నేతన్నలను ప్రసన్నం చేసుకోవడంపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రభుత్వం కూడా నేతన్నలకు వరాలు ప్రకటిస్తూ.. వారికి చేయూత అందిస్తుండటంతో వారంతా గులాబీ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారు. మరి సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి? ఈసారి కేటీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 27 Oct 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story