ఖానాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌(Rekha nayak)‎ బీఆర్‌ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్(Johnson Naik) పోటీ చేస్తున్నారు. దీంతో జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ రేఖా నాయక్ సవాల్ విసురుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‎లో(Congress) ఏకంగా ఆరుగురు అభ్యర్థులు పోటీపడుతుండగా..

ఖానాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌(Rekha nayak)‎ బీఆర్‌ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేశారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్(Johnson Naik) పోటీ చేస్తున్నారు. దీంతో జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తారో చూస్తానంటూ రేఖా నాయక్ సవాల్ విసురుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‎లో(Congress) ఏకంగా ఆరుగురు అభ్యర్థులు పోటీపడుతుండగా.. బీజేపీలో(BJP) మాత్రం రాథోడ్ రమేష్(Rathode Ramesh) ఒక్కరే మళ్లీ పోటీకి సై అంటున్నారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో లోకల్..నాన్ లోకల్ గొడవ ముదురుతున్న నేపథ్యలో టగ్ ఆఫ్ వార్ తప్పదా? ఇక్కడి కారు మరోసారి జెండ ఎగరేస్తుందా? ఈసారి ఖానాపూర్ లో కనిపించే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం(Khanapur Constituency) 1978లో ఏర్పడింది. మూడు జిల్లాల పరిధిలోకి వస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఏడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల ఓటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భారీ మెజార్జీతో గెలిచింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరగగా.. 4 సార్లు టీడీపీ(TDP) గెలిచింది. మూడుసార్లు బీఆర్ఎస్, మరో 3 సార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన రేఖానాయక్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కమీషన్లపై ఉన్న ఫోకస్ అభివృద్ధిపై లేదని, కమీషన్లు లేనిదే కొబ్బరికాయలు కూడా కొట్టరనే అపవాదు మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే రేఖానాయక్. మరోవైపు స్థానిక క్యాడర్, లీడర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు అధిష్టానం టికెట్ నిరాకరించింది. జాన్సన్ నాయక్‎ తోపాటు ఎంపీ సంతోష్ సన్నిహితుడు పూర్ణ చందర్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మన్ నాయక్ టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే అధిష్టానం మాత్రం కేటీఆర్ స్నేహితుడిగా చెప్పుకుంటున్న జాన్సన్ నాయక్‎కు టికెట్ కేటాయించింది.

మంత్రి కేటీఆర్(KTR) కలిసి చదువుకున్న జాన్సన్ నాయక్ ఆర్థికంగా బలంగా ఉన్నారు. అమెరికాలో సాఫ్ట్‎వేర్ కంపెనీ ఉన్న జాన్సన్.. గతంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీకి ప్రయత్నించారు. చివరి నిమిషంలో చాన్స్ మిస్ అవ్వడంతో ఈ సారి ఖానాపూర్ నుంచి అధిష్టానం అవకాశం కల్పించింది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా ఖానాపూర్లో పర్యటిస్తూ క్యాడర్‌ కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆర్థిక అంగబాలాలు సమృద్ధిగా ఉన్న జాన్సన్‌ క్యాడర్ కూడా సుముఖంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తామన్న ధీమాతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.

ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు(BRS) ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ రోజు రోజుకూ మరింత బలపబుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో ఖానాపూర్‎లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గ్రాఫ్ మరింత పెరిగింది. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు బాగానే ఉంది. ఈసారి మరోసారి ఖానాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్న ధీమాతో ఉన్నారు హస్తం పార్టీ నేతలు. ఇక్కడి నుంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఐదుగురు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా వెడమ బొజ్జు(Vedama Bojju) అనే నేత టిక్కెట్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాన్ని తెగ చుట్టేస్టున్న బొజ్జు బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. అయితే ఈయనకు చారులతా రాథోడ్, భరత్ చౌహాన్, పెందూర్ ప్రభాకర్, పుర్క బాపురావ్ నుంచి పోటీ ఎదురవుతోంది.

ఇక ఖానాపూర్ బరిలో నేను సైతం అంటోంది బీజేపీ. ఈ సారి బీజేపీ నేత రమేశ్ రాథోడ్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రమేశ్ రాథోడ్ బీజేపీలో చేరకముందు వరకు ఈ నియోజవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండేది కానీ.. రమేశ్ రాథోడ్ కమలం గూటికి చేరడంతో బీజేపీ బలడింది. రమేశ్ రాథోడ్ కు నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉండటంతో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయినా, బీజేపీకి ఇక్కడ మాత్రం గణనీయంగా ఓట్లు దక్కాయి. గడపగడపకు బీజేపీ కార్యక్రమంతో నియోజకవర్గాన్ని చుట్టేశారు రమేశ్ రాథోడ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. ఈసారి తనకు అవకాశం ఇస్తే ఖానాపూర్ రూపురేఖలు మార్చేస్తానని చెబుతున్నారు.

ఇలా ఖానాపూర్ రాజకీయం హాట్‌హాట్‌గా మారుతోంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేనంటే నేనంటూ పోటీపడుతుండటంతో ఈసారి ముక్కోణ పోరు తప్పేలా లేదు. అయితే ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి కేటీఆర్ అడ్డుకున్నారని రేఖానాయక్ ఆరోపిస్తున్నారు. తన స్నే‎హితుడి కోసం ఖానాపూర్ అభివృద్ధిని అడ్డుకున్నారని, తనకు, ఖానాపూర్ ప్రజలకు చేసిన ద్రోహాన్ని పాదయాత్ర చేసి ఎండగడతానని అంటున్నారు. మొత్తానికి అధికార బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేది బీజేపీయా లేక కాంగ్రెస్సా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. అభివృద్ధినే నమ్ముకున్న బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడతారా? జోరుమీదున్న హస్తం పార్టీకి అండగా నిలబడతారా? లేక కమలం పార్టీకి జై కొడతారా? ఖానాపూర్ లో నయా నాయక్ ఎవరో తెలియాలంటే..మరికొంత కాలం ఆగాల్సిందే..

Updated On 29 Oct 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story