Choppadandi Constituency : చొప్పదండిలో త్రిముఖ పోరు..ఎగిరే జెండా ఎవరిది?
చొప్పదండి నియోజకవర్గం 1957లో ఏర్పడింది. ఈ సెంగ్మెంట్లో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. అవి.. చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల. ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి పీడీఎఫ్(PDF) అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వరరావు(Maneni Rajeshwar Rao) గెలుపొందారు.
చొప్పదండి నియోజకవర్గంలో(Choppadandi Constituency) రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Sunke Ravi Shankar) మరోసారి బరిలో దిగుతుండగా..కాంగ్రెస్(Congress) నుంచి మేడిపల్లి సత్యం(Medipally Sathyam), బీజేపీ(BJP) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ(Bodige shobha) పోటీపడుతున్నారు. అభ్యర్థులందరూ పాతవారే కావడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారింది. ఈ త్రిముఖ పోరులో సిట్టింగ్‌కు మరో ఛాన్స్ ఇస్తారా? విపక్షాల పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి అంశాలు మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
చొప్పదండి నియోజకవర్గం 1957లో ఏర్పడింది. ఈ సెంగ్మెంట్లో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. అవి.. చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల. ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారి పీడీఎఫ్(PDF) అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వరరావు(Maneni Rajeshwar Rao) గెలుపొందారు. ఇక్కడ ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే..కాంగ్రెస్ మూడుసార్లు, టీడీపీ ఆరుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు, పీడీఎఫ్ ఒకసారి గెలిచాయి. చొప్పదండి రిజర్వు అయ్యే వరకు జరిగిన ఎన్నికలలో ఐదుసార్లు రెడ్లు, ఒకసారి వెలమ, రెండుసార్లు బీసీలు ఇతరులు ఒకసారి ఇక్కడి నుంచి గెలుపొందారు.
చొప్పదండి రిజర్వు నియోజకవర్గం అయిన తర్వాత సీనియర్ నేత ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య(Suddhala Devaiah) 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అంతకుముందు రెండుసార్లు నేరెళ్ల నుంచి టీడీపీ(TDP) తరపునే గెలిచారు. 2014లో దేవయ్య టీడీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరినా ఫలితం దక్కలేదు. టిఆర్‌ఎస్ తరపున తొలిసారి పోటీచేసిన మహిళా అభ్యర్ధి బొడిగె శోభ చేతిలో దేవయ్య 54,981 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2014లో చొప్పదండిలో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్ధి మేడిపల్లి సత్యం 13,104 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. పోటీచేసి మరోసారి ఓటమి చెందారు.
చొప్పదండి సగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ముందే తన పేరు ఖరారు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎమ్మెల్యే రవిశంకర్. నారాయణపూర్ ఎడమ కాల్వ పూర్తి చేయడం, మోతె రిజర్వాయర్ నిర్వాసితులకు అత్యధిక పరిహారం ఇప్పించడం, కొండగట్టు ఆలయ అభివృద్ధి, పోతారం రిజర్వాయర్ పూర్తి చేయడం, నారాయణపూర్ వాగుపై బ్రిడ్జి నిర్మాణం, బల్వంతాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌కు లింక్ కెనాల్ నిర్మాణం. చొప్పదండి సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడం.. తదితర పనులు వివరిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల అమలే తనను మరోసారి గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్.
చొప్పదండి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పోటీ చేస్తున్నారు. 2014లో టిఆర్‌ఎస్(TRS) పక్షాన ఎన్నికైన బొడిగె శోభకు..2018లో టిక్కెట్ నిరాకరించారు. దీనికి నిరసనగా శోభ బిజెపిలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఈసారి బీజేపీ తరఫున మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. 2014లో ఎమ్మెల్యేగా తను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తున్నారు బొడిగ శోభ. ఆమె హయాంలోనే రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్, చొప్పదండిలో డిగ్రీ కాలేజీ మంజూరయ్యాయి. చొప్పదండి మండలం గుమ్లాపూర్ క్రాస్ రోడ్డు నుంచి రామడుగు వరకు డబుల్ రోడ్డు, రేవెల్లిలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేశారు. ఈ పనులను గుర్తు చేయడంతోపాటు, బీఆర్ఎస్ వైఫల్యాలపై వస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని ఆశాభావంతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.
ఇక కాంగ్రస్ నుంచి మేడిపల్లి సత్యం మరోసారి పోటీపడుతున్నారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, రాష్ట్రంలో కాంగ్రెస్ పొలిటికల్ గ్రాఫ్ పెరగడంతో గెలుపుపై ఆశలు పెట్టకున్నారు మేడిపల్లి సత్యం. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలు సహకరిస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా అందరూ తనతో కలిసి వస్తారని చెబుతూనే..గెలుపై ధీమాగా వ్యక్తం చేస్తున్నారు మేడిపల్లి సత్యం.
చొప్పదండి అభ్యర్థుల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. చొప్పదండి మున్సిపాలిటీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరకపోవడం, మిడ్ మానేరు నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, డబుల్ బెడ్రూం స్కీమ్ కింద రూ.5 లక్షల 4 వేలు ఇస్తామన్న హామీ నెరవేరకపోవడం వంటి సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ రికార్డు సాధించిన ఘనత న్యాలకొండ రామకిషన్ రావుకు మాత్రమే ఉంది. మరి చొప్పదండి ఓటర్లు గులాబీ పార్టీకి అవకాశం ఇస్తారా? విపక్ష పార్టీలు పాగవేస్తాయా? అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.