NARSAPUR CONSTITUENCY : నర్సాపూర్‌లో ముక్కోణ పోరులో ఎగిరే జెండా ఎవరిది?
ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో అత్యంత వెనకబడిన నియోజకవర్గాల్లో నర్సాపూర్(Narsapur) ఒకటి. తలాపున మంజీరా పారుతున్న కరవు తాండవించిన ప్రాంతమది. ఎంతో మంది ఉద్దండులకు రాజకీయంగా ఆశ్రయమించిన నియోజకవర్గం. ఒకప్పుడు సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి.
ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో అత్యంత వెనకబడిన నియోజకవర్గాల్లో నర్సాపూర్(Narsapur) ఒకటి. తలాపున మంజీరా పారుతున్న కరవు తాండవించిన ప్రాంతమది. ఎంతో మంది ఉద్దండులకు రాజకీయంగా ఆశ్రయమించిన నియోజకవర్గం. ఒకప్పుడు సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయి. జరిగిన అభివృద్ది సంగతేంటి? ఈసారి గులాబీ పార్టీ గెలుపు సాధ్యమేనా..? ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలు.. మీ నియోజకవర్గం.. మా విశ్లేషణలో చూద్దాం.
1952లో నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత వెనకడిన ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 8 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గం భిన్నమైన రాజకీయాలకు వేదికగా మారింది. ఇక్కడ అటవీప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. నర్సాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి 7 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ గెలుపొందాయి. సీపీఐ నుంచి విఠల్‌రెడ్డి ఐదుసార్లు గెలుపొందారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నర్సాపూర్ గులాబీ పార్టీకి అడ్డగా మారింది.
నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల పోరు ఆసక్తిరేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా..అసమ్మతి సెగ తగ్గడం లేదు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) నుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అసమ్మతి నేతల సహకారం లేకపోతే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. దీంతో అన్ని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అసమ్మతి నేతలందరినీ ఆయా పార్టీల నేతలు బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy) బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి(Aavula Raja Reddy), బీజేపీ నుంచి ఎర్రగొళ్ల మురళీయాదవ్(Yerragolla Murali Yadav) పోటీపడుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సాపూర్ నుంచి బరిలో దిగుతున్న మాజీ ఎమ్మెల్యే సునితారెడ్డికి రాజకీయంగా మంచి రికార్డు ఉంది. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. కానీ తెలంగాణ వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చినా..నర్సాపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే, మంత్రి సునితారెడ్డికే అవకాశం కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). గత రెండు ఎన్నికల్లో ఓటమిపాలైన సునీతా లక్ష్మారెడ్డి.. ఈసారి ఎలాగైనా గెలచి, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. దీని కోసం అసంతృప్త నేతల మద్దతు కూడగట్టే పనిలోపడ్డారు సునితా లక్ష్మారెడ్డి.
ఇక నర్సాపూర్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్(congresss) అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక్కడి నుంచి చాలా మంది ఆశావహులు పోటీపడినా అధిష్టానం మాత్రం రాజిరెడ్డికే అవకాశం కల్పించింది. వాస్తవానికి నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఈ నియోజకవర్గం. ఇప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతోపాటు ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమా కూడా ఉంది. అయితే
కొందరు అసమ్మతి నేతలు సర్దుకుపోతుండగా మరికొందరు మాత్రం.. హైకమాండ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారందరినీ బుజ్జగించే పనిలోపడింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.
మరోవైపు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎర్రగొళ్ల మురళీ యాదవ్.. ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన భార్య రాజమణి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పని చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఎర్రగొళ్ల మురళీ యాదవ్.. ఏడాది కింద బీజేపీలోచేరారు. నర్సాపూర్ బీజేపీ టికెట్ కోసం ఆరుగురు పోటీపడగా..హైకమాండ్ మాత్రం మురళీ యాదవ్‌కు టికెట్ కేటాయించింది. బీజేపీలోనూ టికెట్ ఆశించి భంగపడి.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలంతా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్‌గా మారింది. ఇప్పుడు అసంతృప్త నేతలందరినీ బుజ్జగించి..దారిలోకి తెచ్చుకునే పనిలో ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం.
నర్సాపూర్‌లో ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 2,20,211 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం. 1,07,587 మంది పురుషులు ఉంటే మహిళలు, 1,12,617 మంది ఉన్నారు. ఈ సారి నర్సాపూర్‌లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. మరి.. నర్సాపూర్ ఓటర్లు ఈసారి ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.