Jagtial Constituency : పోరాటాల గడ్డ.. జగిత్యాల ఎవరి అడ్డా?
పోరాటాల గడ్డ జగిత్యాల(Jagtial) రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారపర్వం ఊపందుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్(Sanjay) మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) బరిలో దిగుతున్నారు.
పోరాటాల గడ్డ జగిత్యాల(Jagtial) రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారపర్వం ఊపందుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్(Sanjay) మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) బరిలో దిగుతున్నారు. ఇక బీజేపీ(BJP) అభ్యర్థిగా బోగా శ్రావణి(Boga Shravani) తన అదృష్ట్నాన్ని పరిక్షించుకుంటున్నారు. జగిత్యాల గడ్డపై ఈసారి గెలుపు జెండా ఎగరేసేది ఎవరు? వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుంటుందా? కంచుకోటను కాంగ్రెస్ మళ్లీ చేజిక్కించుకుంటుందా? జగిత్యాల నియోజకవర్గంలో(Jagtial Constituency) ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు జగిత్యాల. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డ జగిత్యాల. ఒకప్పుడు కల్లోలిత ప్రాంతం..ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారిపోయింది. రాజకీయంగానూ ఎంతో చైతన్యవంతమైన ఈ ప్రాతం ఎంతో అనుభవం కలిగిన నేతలను కూడా మట్టికరిపించింది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, జీవన్‌రెడ్డి, ఎల్.రమణ(L.Ramana) ఇద్దరూ.. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో.. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై.. డాక్టర్ సంజయ్(Dr.Sanjay) 61 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక.. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎల్.రమణ తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. దశాబ్దకాలంగా.. జగిత్యాల రాజకీయం మొత్తం..
ఈ ముగ్గురు లీడర్ల చుట్టే తిరుగుతోంది.
జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల మండలంతోపాటు రాయికల్, సారంగపూర్, భీర్పూర్ మండలాలున్నాయి. దాదాపు 2 లక్షల 14 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్లో బీసీ ఓటర్లే అధికం. పద్మశాలిలు 26 వేలు, మున్నూరు కాపు 23 వేలు, మైనారిటీలు 30 వేలు, ముదిరాజులు 18 వేలు, ఎస్సీ ఎస్టీ ఓటర్ల సంఖ్య 28 వేలు. మైనార్టీ, మూన్నూరు కాపు ఓట్లే ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. 2014 ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్‌ని ఆదరించారు. 2018లో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో గత ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ 60 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈసారి మైనార్టీల ఓట్ల మీదే ఇటు అధికార పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దృష్టి పెట్టాయి. మైనార్టీ ఓట్లను రాబట్టుకునేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కూడా ఓట్ బ్యాంక్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్(BRS) నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరోసారి పోటీ చేస్తున్నారు. రెండోసారి కూడా గెలుపుపై ధీమాగా ఉన్న ఆయన.. ఈసారి గతంలో కంటే భారీ మెజారిటీతో విజయం సాధించాలని చూస్తున్నారు. టీడీపీ(TDP), కాంగ్రెస్ తప్ప మరో పార్టీకి అవకాశం లేని పరిస్థితుల్లో.. జగిత్యాలలో తొలిసారి గులాబీ జెండా ఎగరేశారు డాక్టర్ సంజయ్ కుమార్. ఇక.. టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఎల్.రమణ ఎమ్మెల్సీ అవడం, ఆయన సామాజికవర్గం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉండటం.. సంజయ్‌కి అనుకూల అంశం. పైగా.. రమణతో.. సంజయ్‌కి మొదట్నుంచి ఉన్న సాన్నిహిత్యం కూడా సంజయ్‌కి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. జగిత్యాలలో జరిగిన అభివృద్ధే.. తనను గెలిపిస్తుందనే ధీమా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈసారి జగిత్యాలలో కాంగ్రెస్ గెలుపుపై నమ్మకంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో.. తనకవే చివరి ఎన్నికలంటూ ప్రచారం సాగించినా.. ఓటమి పాలయ్యారు. కానీ.. ఈసారి.. అప్పుడు చెప్పిన మాటను.. మూట గట్టి.. గోదావరిలోకి విసిరేసి.. ఈసారి మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. మైనార్టీల ఓట్ల మీదే జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. తన కంచుకోటలో.. మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా జీవన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని జీవన్‌రెడ్డి చెబుతున్నారు. జగిత్యాలలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే అంటున్నారు సీనియర్ నేత జీవన్ రెడ్డి.
ఇక జగిత్యాల బరిలో నేను సైతం అంటోంది బీజేపీ. నియోజకవర్గంలో అత్యధికంగా మైనార్టీ ఓటు బ్యాంకు ఉండటం బీజేపీకి మైనస్‌గా మారే అవకాశముంది. అయితే హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్లాలని బిజెపి పక్క ప్లాన్ చేస్తుంది. బీసీ ఓటర్లందరినీ తమవైపు తిప్పుకోవాలనే యోచనలో కాషాయం పార్టీ ఉంది. ఈసారి బీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిన మున్సిపల్ మాజీ ఛైర్మన్ డా. భోగ శ్రావణికి టికెట్ కేటాయించింది. జగిత్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శిస్తున్న బీజేపీ నేతలు..ప్రజలు తమకు అవకాశం ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నారు.
జగిత్యాల బరిలో బీజేపీ రేసులో ఉన్నా..బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. అయితే ఓటర్లు సంజయ్ కి మరో అవకాశం ఇస్తారా? ఇదే ఫైనల్ ఛాన్స్ అంటున్న జీవన్ రెడ్డివైపు నిలబడతారా? జగిత్యాలను మళ్లీ కాంగ్రెస్ కంచుకోటగా మార్చేందుకు..జీవన్ రెడ్డి ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? జగిత్యాల గడ్డపై పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.