Malkajgirir Constituency : అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరిలో సత్తా చాటేదెవరు?
అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరిలో(Malkajgirir Constituency ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్(BRS) ఎత్తులు వేస్తుంటే..ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ(Congress) వ్యూహాలకు పదును పెడుతోంది.
అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్ గిరిలో(Malkajgirir Constituency ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్(BRS) ఎత్తులు వేస్తుంటే..ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ(Congress) వ్యూహాలకు పదును పెడుతోంది. మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampalli Hanumanth Rao) ఇప్పుడు కారు దిగి కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న మైనంపల్లిని మల్కాజ్ గిరి ఓటర్లు ఆదరిస్తారా? లేదంటే విపక్షాలకు అవకాశం ఇస్తారా..? మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
2009లో మల్కాజ్ గిరి నియోజకవర్గం ఏర్పడింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో మల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ, మౌలాలి, వినాయక్‌నగర్, కాకతీయనగర్, తూర్పు ఆనందబాగ్, గౌతమ్‌నగర్, నేరేడ్‌మెట్, సైనిక్‌పురి, ఆల్వాల్, యాప్రాల్, మచ్చ బొల్లారం వంటి ప్రాంతాలున్నాయి. ఈ సెగ్మెంట్లో మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల రాజేందర్(Aakula Rajender) విజయం సాధించారు. రాష్ట్ర అవతరణ తర్వాత 2014లో బీఆర్ఎస్ నుంచి కనకారెడ్డి(Kanaka Reddy)ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 2018లో బీఆర్ఎస్ నుండి మైనంపల్లి హన్మంతరావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక బిసి నేత ఇక్కడి నుంచి గెలుపొందారు.
ప్రస్తుతం మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బరిలో దిగుతున్నారు. గతంలో ఈయన ఒకసారి రామాయంపేట ఉప ఎన్నికలు, ఆ తర్వాత మెదక్ టీడీపీ(TDP) అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్లో చేరిన మైనంపల్లి.. లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. తన సమీప ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామచంద్రరావుపై 73, 698 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మైనంపల్లి మొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఆయన పార్టీని వదిలేసి వచ్చారు. ఆయనకు ఇచ్చిన హామీ ప్రకారం మైనంపల్లికి మల్కాజ్ గిరి, మెదక్ నుంచి ఆయన తనయుడు రోహిత్ రావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిచింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మైనంపల్లి.. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు.
అటు అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా మల్కాజ్ గిరి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ ఎమెల్యే అభ్యర్థిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి(Marri Rajashekar Reddy) బరిలో దిగుతున్నారు. ఈయన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ తలపడిన అనుభవం.. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు.. రాజశేఖర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. మంత్రి మల్లారెడ్డి కూడా మల్కాజ్ గిరిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఒకవైపు ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తూనే.. మరోవైపు ఫ్లెక్సీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి మరోసారి తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి.
ఇక మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు(Ram chandra Rao) మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇక్కడి నుంచి కొందరు బీసీ(BC) నేతలు తమకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినా..అధిష్టానం మరోసారి రామచంద్రరావుకే అవకాశం కల్పించింది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2019లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. రామచంద్రరావును నాన్ లోకల్ ముద్ర కూడా వెంటాడుతోంది. మల్కాజ్‌గిరి పరిధిలో ఉన్న మూడు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచినా..ఈ ఎన్నికలను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచినప్పటికీ..ఇప్పుడు అనూహ్యంగా మూడోస్థానానికి పడిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొత్తానికి..రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం.. మొన్నటి వరకు బీఆర్ఎస్లో కొనసాగిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి పార్టీ మారిన పరిణామంలో..మల్కాజ్ గిరిలో మొత్తం రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. దీంతో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అధికార బీఆర్ఎస్ పార్టీ..ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ.. వ్యూహ రచన చేస్తున్నాయి. అటు బీజేపీ సైతం సమరానికి సై అంటోంది. ఇక ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. మరి మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు మహాశయులు అధికార పార్టీకి అవకాశం ఇస్తారా? లేదంటే..సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికే మరోసారి పట్టంకడతారా? అన్నది అసక్తికరంగా మారింది.