Quthbullapur Constituency : హ్యాట్రిక్‌పై కన్నేసిన కేపీ వివేకానంద..కుత్బుల్లాపూర్ విజేత ఎవరు?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్(Vivekanand Goud) కు హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తారా? లేదంటే కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పాగా వేస్తాయా? విపక్షాల బలమూ బలహీనతలేంటి? నియోజకవర్గం ఓటర్ల నాడి ఎలా ఉంది? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
మేడ్చల్(Medchal)-మల్కాజిగిరి(Malkajgiri) జిల్లాలోని 5 నియోజకవర్గాలలో కుత్బుల్లాపూర్(Quthbullapur Constituency) ఒకటి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కూడా. ఫార్మా కంపెనీలు(Pharma companies)..రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్(Vivekanand Goud) కు హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తారా? లేదంటే కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పాగా వేస్తాయా? విపక్షాల బలమూ బలహీనతలేంటి? నియోజకవర్గం ఓటర్ల నాడి ఎలా ఉంది? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
తెలంగాణలో ఎక్కువ మంది ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవవర్గాలలో కుత్బుల్లాపూర్ ఒకటి. ఓటర్ల జాబితా ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో మొత్తం ఆరు లక్షల 69 వేల 253 గా తేలింది. పురుషులు 14 వేల తొమ్మిది వందల నలభై మూడు ఉండగా మహిళా ఓటర్లు 14 వేల 713 గా ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కుత్బుల్లాపూర్. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజులరామారం లాంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి కంపెనీల్లో దాదాపు 2 లక్షల మంది కార్మికులు పని చేస్తుంటారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జీడిమెట్ల, నిజాంపేట, సుభాష్‌నగర్ లాంటి ప్రాంతాలు వరద సమస్యను ఎదుర్కొంటున్నాయి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి రాజకీయం రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడి రాజకీయాలకు కులమే కేంద్ర బిందువు. ఈ సెగ్మెంట్ పరిధిలో రెడ్డి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపులు అధికంగా ఉన్నా..గౌడ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే..గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక్కడ గౌడ సామాజికవర్గం ఓట్లే కీలకం. ఈ నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్లలో.. 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవగా, ఒకచోట బీజేపీ విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లోనూ ఈ కార్పొరేటర్లు కూడా కీలకం కానున్నారు. ఇక..ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 10 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ
పంపిణీ చేయలేదన్న వ్యతిరేకత లబ్దిదారుల్లో కనిపిస్తోంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద గౌడ్ మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్.. వరుసగా మూడోసారి గెలిచి.. హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. కొందరు కార్పొరేటర్లు ఆయనకు మద్దతివ్వడం లేదని నియోజవకర్గంలో చర్చ జరుగుతోంది. ఇదే టికెట్ గతంలో శంభీపూర్ రాజుకు కేటాయిస్తారని అంతా అనుకున్నారు. కానీ పార్టీ అలా చేయకపోవడంలో శంభీపూర్ వర్గం వివేకానందకు మద్దతివ్వడం లేదని తెలుస్తోంది. అయితే కేపీ వివేకానందకు కూడా కొంత మంది కార్పొరేటర్లు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి మద్దతుతో ముందుకు వెళ్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని, ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానన్న ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద.
ఇక బీజేపీ(BJP) తరఫున మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Koona Srisailam Goud) బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరడంతో.. ఈ సెగ్మెంట్లో కమలం పార్టీ బలం పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి.. బీఆర్ఎస్కు(BRS) గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, యువ నాయకుడు భరతసింహారెడ్డి.. టికెట్ ఆశించినా..శ్రీశైలం గౌడ్‌కే అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. అధికార బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు.. తమకు కలిసొస్తాయని బీజేపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీశైలం గౌడ్ కు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉంది. గౌడ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కూన శ్రీశైలం గౌడ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు నుంచి బీజేపీలోకి వచ్చారు. ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే ప్రభుత్వ వ్యతిరేక విధాలను నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు తనకు పట్టడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్.
ఈ సారి కాంగ్రెస్ నుంచి కొలన్ హన్మంతరెడ్డి(Kolan Hanmantha Reddy) ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇక్కడి నుంచి నర్సారెడ్డి భూపతిరెడ్డి, జోత్స్న శివారెడ్డి టికెట్ ఆశించినా..కొలన్ హన్మంతరెడ్డికే అధిష్టానం టికెట్ కేటాయించింది. కూన శ్రీశైలం గౌడ్..కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో కుత్బుల్లాపూర్‌లో హస్తం పార్టీ కొంత బలహీనపడింది. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. రేవంత్ ప్రధాన అనుచరుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ప్రస్తుతం అసంతృప్త నేతలు ఎమ్మెల్యే అభ్యర్థికి సహకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్న ముస్లింలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లని నమ్ముకున్నారు కాంగ్రెస్ నేతలు.
ఏది ఏమైనా ఈ సారి కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో బీఆర్ఎస్-బీజేపీల మధ్యే ప్రముఖంగా పోటీ ఉండనుంది. రెండు పార్టీలకూ గెలుపు కత్తిమీద సాములా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హ్యాట్రిక్ కొడతారా? కూన శ్రీశైలంగౌడ్ మరో అవకాశం ఇస్తారా? కాంగ్రెస్ పాగా వేస్తుందా? అన్నది తెలియాలంటే..డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.