Ramagundam Constituency : అయ్యోపాపం అంటే గెలుపే..కార్మికుల అడ్డా రామగుండంలో ఎగిరే జెండా ఏది?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్డ్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. మరి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్(Korukanti Chander) గ్రాఫ్ ఎలా ఉంది?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్డ్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. మరి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్(Korukanti Chander) గ్రాఫ్ ఎలా ఉంది? మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్(MS Raj Thakur), బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి(Kandhula Sandhya Rani) బరిలో దిగుతున్నారు. రామగుండం సెగ్మెంట్‌లో అధికార, విపక్షాల రాజకీయ వ్యూహాలేంటి? ఈ పరిస్థితుల్లో.. ఈసారి రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనిపించబోయే లిటికల్ పిక్చర్ ఏంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
2009లో రామగుండం నియోజకవర్గం(Ramagundam Constituency) ఏర్పడింది. ఈ సెంగ్మెంట్లో రామగుండం కార్పొరేషన్‌తోపాటు రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలు ఉన్నాయి. 2018 ఆగస్టు వరకు ఈ నియోజకవర్గం పరిధిలో 2 లక్షల 20 వేల మందికిపైనే ఓటర్లు ఉంటే..అందులో 60 వేలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణను(Somarapu Satyanarayana) ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్(BRS) తరఫున పోటీ చేసిన సోమారపు సత్యనారాయణకు మరోసారి పట్టం కట్టారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థిగా ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి కోరుకంటి చందర్ పోటీ చేసి..గెలుపొందారు. ఈ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సోమారపు కారు పార్టీని వీడారు. అదే సమయంలో కోరుకంటి చందర్ బీఆర్ఎస్‌లో చేరి..పెద్దపల్లి జిల్లాపార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
రామగుండం ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ హవా కొనసాగినా..ఇక్కడ మాత్రం జనం మెచ్చిన నేతలే గెలుస్తారు. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కోల్డ్ బెల్ట్ కార్మికులే. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మికుల నాడి ఎవరికీ అంతుపట్టదు. అలా సానుభూతితో ఎన్నికల్లో ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా.. అలా గెలిచిన నాయకుడే. రామగుండంలో ఓటర్లను డబ్బు ప్రభావితం చేయదు అని చెప్పడానికి.. కోరుకంటి ఎన్నికే బెస్ట్ ఎగ్జాంపుల్. కార్మికులు, వారి కుటుంబాలను ప్రసన్నం చేసుకుంటే చాలు.. ప్రజాప్రతినిధిగా గెలిచేయొచ్చని చెబుతుంటారు.
ఇక కాంగ్రెస్ నుంచి 3 సార్లు పోటీ చేసి ఓటమిపాలైన మాజీ శాప్ ఛైర్మన్ మక్కాన్ సింగ్.. మరోసారి హస్తం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ..ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. రామగుండంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శలు చేస్తున్నారు మక్కాన్ సింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో ఈసారి ఖచ్చితంగా రామగుండం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు మక్కాన్ సింగ్.
రామగుండం నుంచి బీజేపీ అభ్యర్థిగా పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ, కౌశిక్ హరి టికెట్ ఆశించినా.. అధిష్టానం కందుల సంధ్యారాణికి అవకాశం కల్పించింది. అయితే.. బీజేపీలో.. సోమారపుని కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం సాగుతోంది. దాంతో.. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు సన్నిహితులు. అయితే.. రామగుండంలో అభివృద్ధి తన హయాంలో జరిగిందంటున్నారు సోమారపు సత్యనారాయణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తాను తెచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరిగిందని.. అధికార పార్టీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు.
ఈ ఎన్నికల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ. 2018లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకంటి చందర్..బీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై విజయం సాధించారు. ఈసారి ఫార్వార్డ్ బ్లాక్ నుంచి.. మిగతా పార్టీలకు చెందిన రెబల్స్ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్శశాలి, గౌడ, కాపు, పెరిక,, ముదిరాజ్, చాకలి కులస్తులు ఉన్నారు. ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంఆ ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి.
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువల కర్మాగారం ఉద్యోగాల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టుతున్నాయి. ఇసుకు దందా, బూడిద దందాతోపాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. పార్టీలో మొదటి నుంచి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగినగానీ ఇప్పటి వరకు సమస్య సమస్యగానే ఉంది. పనులు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయి.
ఏదేమైనా.. వెనుకబడిన రామగుండాన్ని తానే అభివృద్ధి చేశానంటున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తన హయాంలోనే.. మెడికల్ కాలేజీ వచ్చిందని.. అదే విధంగా ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణన్ని త్వరలోనే ప్రారంభిస్తామంటున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీరు అందించేందుకు.. సింగరేణి సహకారంలో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కూడా చేస్తామని చెప్పారు. సింగరేణి చరిత్రను తెలియజేసేలా.. తన హయాంలోనే సింగరేణి గనులను పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు కోరుకంటిటి చందర్.
మొత్తానికి ఈసారి రామగుండం నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈసారి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తు అయిన సింహం.. అందరికీ బాగా తెలుసు. దాంతో.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు చీలతాయనే అంచనాలున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది రామగుండం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.