Koratla Constituency : కోరుట్లలో వారసుల కొట్లాట.. గెలుపు జెండా ఎగరేసేదెవరు?
కోరుట్లలో కొట్లాట మొదలైంది. గులాబీ కంచుకోట కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(Kalvakuntla vidhyasagar) తనయుడు కల్వకుంట్ల సంజయ్‌కి(Kalvakuntla Sanjay) బీఆర్ఎస్(BRS) టికెట్ కేటాయించింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్న ఈ యువనేత గెలుపు జెండా ఎగరేస్తాడా? కాంగ్రెస్‌కు ఈసారైనా పట్టు దొరుకుతుందా?
కోరుట్లలో కొట్లాట మొదలైంది. గులాబీ కంచుకోట కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(Kalvakuntla vidhyasagar) తనయుడు కల్వకుంట్ల సంజయ్‌కి(Kalvakuntla Sanjay) బీఆర్ఎస్(BRS) టికెట్ కేటాయించింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్న ఈ యువనేత గెలుపు జెండా ఎగరేస్తాడా? కాంగ్రెస్‌కు ఈసారైనా పట్టు దొరుకుతుందా? కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జూనియర్ జువ్వాడి నర్సింగ్‌రావు మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు. ఇక బీజేపీ(BJP) నుంచి కూడా మరో యువతనే ధర్మపురి అరవింద్(Dharmapuri Arvindh) సమరానికి సై అంటున్నారు. మొత్తానికి మూడు ప్రధాన పార్టీల నుంచి యువ నేతలు పోటీ చేస్తుండటంతో కోరుట్ల రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి కోరుట్ల సెగ్మెంట్‌లో కనిపించే పొలిటికల్ సీనేటింటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
2009లో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం కోరుట్ల. నియోజకవర్గాల పునర్విభజనత తర్వాత కోరుట్ల కారు పార్టీకి కంచుకోటగా మారింది. 2009 నుంచి వరుసగా ఇక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్న బీఆర్ఎస్‌కు మంచి పట్టు ఉంది. నాలుగు దఫాలుగా ఇక్కడ విజయం కోసం ప్రతిపక్ష పార్టీ పరితపిస్తోంది. ఈసారి కోరుట్ల కోటలో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. బీజేపీ కూడా గట్టిగానే పోటీపడుతోంది. ఈసారి కోరుట్లలో 3 ప్రధాన పార్టీల నుంచి యువ నేతలు బరిలోకి దిగుతుండటంతో ప్రజాతీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రజామద్దతు తమకంటే తమకేనన్న ధీమాతో ఉన్నారు ముగ్గురు యువ నేతలు.
కోరుట్ల నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలతోపాటు కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 లక్షల 23 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. మున్నూరు కాపులు 16 వేలు, దళితులు 24 వేలు, పద్మశాలిలు 28 వేలు, ముస్లింలు 28 వేల మందికి పైనే ఉన్నారు. కోరుట్లలో పద్మశాలి, ముస్లింల ఓట్లే అత్యధికం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా వీరే. గ్రామీణ ప్రాంతాల్లో మున్నూరు కాపులు, గీత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీలు, మైనారిటీలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు 20 వేల ఓట్లకు పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు.
కోరుట్ల నియోజకవర్గం(Koratla Constituency) ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్నాయి. అయినా వరుసగా నాలుగుసార్లు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావునే గెలిపిస్తూ వస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ.. మిగతా పార్టీలకు పెద్దగా ప్రాబల్యం లేకపోవడంతో బీఆర్ఎస్‌కు(BRS) పూర్తిగా అనుకూలంగా మారింది. కోరుట్లలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నియోజకవర్గంలో కారు హవా కొనసాగుతున్నా..గతంతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో క్రమేణా పుంజుకున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో అంతా యువకులే నిలుస్తుండటం కూడా కోరుట్ల రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ పార్టీ ప్రచారంలో ముందున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. నియెజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు యువనేత సంజయ్.
ఇక గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ ఓటమిపాలైన జూనియర్ జువ్వాడి నర్సింగ్ రావు(Jr.Juvvadi Narsingh Rao) ఈసారి తన గెలుపు ఖాయమంటున్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని.. ఖచ్చితంగా ఈసారి కోరుట్ల ప్రజలు తనకే పట్టంకడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆశించిన స్థాయిలో కోరుట్లలో అభివృద్ధి జరగలేదని.. ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనని నర్సింగ రావు ధీమాగా ఉన్నారు. మరోవైపు తన తనయుడు కొంరెడ్డి కరమ్ కోసం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కొంరెడ్డి రాములు..బీఎస్సీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కోరుట్లలో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే కోరుట్లలో బీజేపీ గ్రాఫ్ కాస్త పెరిగింది. దీంతో టికెట్ ఆశించిన వారి సంఖ్య కూడా ఈసారి పెరిగింది. కానీ అనూహ్యాంగా కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ ని బీజేపీ అధిష్టానం బరిలోకి దింపుతోంది. ప్రధాని మోదీ చరిష్మానే తన గెలుపుకు అనుకూలిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ధర్మపురి అరవింద్(Dharmapuri Arvindh). ఈసారి కోరుట్ల గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమంటున్నారు. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన భంగపడిన నేతలు..అరవింద్ గెలుపుకు సహకరిస్తారా? లేదా అన్నది అయోమయంగా ఉంది.
అయితే కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం నిజాం చక్కెర కర్మాగారం. తెలంగాణ వచ్చిన తర్వాత చక్కర ఫ్యాక్టరీ(Sugar factory) మూసి వేయడం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విద్యాగార్ రావు ఫ్యాక్టరీ తెరిపిస్తానని వాగ్ధానం చేశారు. కానీ ఇప్పటికీ తెరవకపోవడం కీలక అంశం. గల్ఫ్ కార్మికుల సమస్య తెలంగాణ వచ్చాకా ఎన్.ఆర్.ఐ. పాలసీ తీసుకొస్తామని చెప్పినా తీసుకురాకపోవడం వంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూసే అవకాశం ఉంది. పసుపు గట్టిబాటు ధర కల్పించకపోవడం కూడా కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలపై ప్రభావం చూపేలా ఉంది.
మొత్తానికి కోరుట్లలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నమ్ముకుంటే.. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో దూరమైన మైనార్టీలను తమ వైపు తిప్పుకునే పనిలోపడింది. ఇక హిందువుల ఓట్లపైనే గురిపెట్టింది బీజేపీ. మొత్తానికి మారిన రాజకీయ సమీకరణాలతో కోరుట్లలో ముక్కోణ పోరు తప్పేలా లేదు. ఈ పరిస్థితుల్లో.. అక్కడ ఏ పార్టీ గెలుపు జెండా ఎగరేస్తుందన్నది ఆసక్తిగా మారింది.