ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం(Warangal West Constituency ). జిల్లాల పునర్విభజన తర్వాత ఇక్కడ భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి ధీటుగా ప్రధాన పార్టీలైన బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు మారుతున్నాయి.

ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం(Warangal West Constituency ). జిల్లాల పునర్విభజన తర్వాత ఇక్కడ భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి ధీటుగా ప్రధాన పార్టీలైన బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు మారుతున్నాయి. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి గులాబీ(BRS) పార్టీకి అండగా నిలిచిన ఈ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. పశ్చిమలో కారు జోరుకు బ్రేకులు వేయడం సాధ్యమవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్(Dasyaam Vinay Bhaskar) పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉంది? పశ్చిమలో విపక్షాల వ్యూహాలేంటి. మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ(Hanmakonda), కాజీపేట(Kajipet) ప్రాంతాలను కలుపుకొని ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు హన్మకొండ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజనకు ముందు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక భాగం ఉన్న ఓటర్లను.. ప్రస్తుత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కలిపారు. కాజీపేట, హన్మకొండ, న్యూశాయంపేట, వరంగల్ ప్రాంతంలోని మట్టెవాడ, రంగంపేట లాంటి ప్రాంతాలు వరంగల్ వెస్ట్ పరిధిలోకి వచ్చేశాయి. ఈ సెగ్మెంట్ పరిధిలో 2 లక్షల 66 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అత్యధిక ఓటర్లు విద్యావంతులే. 2004లో మందాడి సత్యనారాయణ(Mandadi Satyanarayana) గెలిస్తే.. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

బీఆర్ఎస్(BRS) ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. పశ్చిమలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ అధికార పార్టీ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. 2009 నుంచి బీఆర్ఎస్ కు పశ్చిమలో వినయ్ భాస్కర్ తప్ప మరో వ్యక్తి లేడనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్ కు మరోసారి టికెట్ దక్కింది. ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. హంగు ఆర్బాటం లేకుండా అందరితో కలివిడిగా ఉండే వినయ్ భాస్కర్‎కు ప్లస్ పాయింట్‎గా మారనుంది. అటు పార్టీలోనూ.. ఇటు నియోజకవర్గంలోనూ వినయ్ భాస్కర్ కు మంచి పేరుంది. ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌ పదవిలో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్(CM KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(CM KCR) అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. వరుసగా గెలుస్తూ రావడం, ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత మినహా.. మరే రకంగానూ.. వినయ్ భాస్కర్‌కు అంతగా ప్రతికూల పరిస్థితులు లేవనే చెప్పొచ్చు. అయితే వచ్చే ఈ ఎన్నికలు వినయ్ భాస్కర్ కి అంత ఈజీగా ఉండవన్న చర్చ ప్రజల్లో సాగుతోంది.

అభివృద్ధి సంక్షేమం విషయంలో నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు జరిగినప్పటికీ ఇంకా కొన్ని పనులు పెండింగ్‎లో ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ ఫలాలు కొందరికే పరిమితం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బాల సముద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి..రెండేళ్లు కావస్తున్నా ఇంకా లబ్దిదారులకు అప్పగించకపోవడంతో గృహ ప్రవేశం కాక ముందే ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం..అప్పగింతలో ఆలస్యం అవడంతో కమ్యూనిస్టులతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనబాట పట్టింది. అయితే నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక భద్రకాళి బండ్, 33 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీజినల్ సైన్స్ సెంటర్, పార్కులు, జంక్షన్లు, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌తో.. వరంగల్ వెస్ట్ హెల్త్, ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం హబ్‌గా మారిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.

ఈసారి వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‎పై కాంగ్రెస్ గట్టి ఆశలు పెట్టుకుంది. ఇక్కడి నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) బరిలో దిగుతున్నారు. డీసీసీ మాజీ ప్రెసిడెంట్ జంగా రాఘవ‎రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఇక్కడి నుంచి టికెట్ ఆశించినా..కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నాయిని రాజేందర్ రెడ్డివైపే మొగ్గుచూపింది. ఇప్పటి వరకు టికెట్ ఆశించి భంగపడిన ముగ్గురు నేతలు నాయిని గెలుపునకు సహకరిస్తారా? పశ్చిమ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తాయా అన్నది కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో ఏమైనా ఈసారి ఎలాగైనా పశ్చిమలో కాంగ్రెస్ జెండా పాతాలనే పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ నేతలు.

ఇక వరంగల్ పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థిగా రావుపద్మ(Raopadma) బరిలో దిగుతున్నారు. బీజేపీ నాయకత్వం కూడా ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి కచ్చితంగా ప్రజలు తమకే అవకాశం ఇస్తారనే ధీమాతో ఉన్నారు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. ఇప్పటికే ఆవిడ ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ని ఓడించేందుకు.. వ్యూహాలు రచిస్తున్నారు.

ఏదేమైనా పశ్చిమ వరంగల్ సెగ్మెంట్‎పై పట్టు సాధించేందుకు అధికార బీఆర్ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే వ్యూహ రచన చేస్తున్నాయి. ఈసారి పశ్చిమలో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. ఐదోసారి కూడా విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. పశ్చిమలో కారు పార్టీ స్పీడుకు బ్రేకులు వేయడం అంత కష్టమేమీ కాదనే ధీమాలో.. బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వరంగల్ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

Updated On 31 Oct 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story