Uppal Assembly constituency : ఉప్పల్‌లో రెండోసారి గెలిచిన చరిత్ర లేదు.. ఆ ఆనవాయితీని బీఆర్ఎస్ బ్రేక్ చేస్తుందా?
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఉప్పల్ నియోజకవర్గంలో(Uppal Assembly constituency) పొలిటికల్ హీట్ పోరిగింది. ప్రధాన పార్టీలు ఈ సెగ్మెంట్ పై పూర్తి ఫోకస్ పెట్టాయి. ఇక్కడ గెలిస్తే వాస్తుపరంగా కలిసొస్తుందన్నది పార్టీల నమ్మకం. ఇక్కడ ఒకసారి గెలిచిన వ్యక్తి రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. ఒకసారి విజయం సాధించిన పార్టీ మళ్లీ జెండా ఎగరవేసిన చరిత్ర లేదు. అలాంటి చరిత్ర కలిగిన ఉప్పల్ సెగ్మెంట్లో ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి..
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఉప్పల్ నియోజకవర్గంలో(Uppal Assembly constituency) పొలిటికల్ హీట్ పోరిగింది. ప్రధాన పార్టీలు ఈ సెగ్మెంట్ పై పూర్తి ఫోకస్ పెట్టాయి. ఇక్కడ గెలిస్తే వాస్తుపరంగా కలిసొస్తుందన్నది పార్టీల నమ్మకం. ఇక్కడ ఒకసారి గెలిచిన వ్యక్తి రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. ఒకసారి విజయం సాధించిన పార్టీ మళ్లీ జెండా ఎగరవేసిన చరిత్ర లేదు. అలాంటి చరిత్ర కలిగిన ఉప్పల్ సెగ్మెంట్లో ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి..రెండోసారి జెండా ఎగరెయ్యాలని చూస్తోంది కారు పార్టీ. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు కారు స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయా? సెటిలర్లు, కార్మికులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఈ సారి సత్తా చాటేదెవరు? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు మేడ్చల్ అసెంబ్లీలో అంతర్భాగంగా ఉండేది. నాచారం, చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్న ఈ నియోజకవర్గంలో కార్మికుల ప్రభావం ఎక్కువ. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఎక్కువ మంది సెటిలర్లు ఈ నియోజవవర్గంలో నివసిస్తున్నారు. సుమారు 4 లక్షల 95 వేల 105 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లే 2 లక్షల 57 వేల 969 మంది. ఇక మహిళా ఓటర్లు 2 లక్షల 37 వేల 102 మంది ఉన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లోనూ ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఒకసారి గెలిచిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వలేదు. 2009లో కాంగ్రెస్‌కు(Congress) అవకాశం ఇచ్చిన ఓటర్లు.. 2014లో టీడీపీతో(TDP) పొత్తు పెట్టుకున్న బీజేపీని(BJP) గెలిపించారు. ఇక 2018లో బీఆర్‌ఎస్‌ను(BRS) ఆశీర్వదించారు. ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉండటంతో..ఈసారి ఏ పార్టీ జెండా ఎగరేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఉప్పల్ నియోజవర్గం పరిధిలో మొత్తం మొత్తం పది డివిజన్లు ఉన్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆరు డివిజన్లలో విజయం సాధించగా, రెండు చోట్ల కాంగ్రెస్, మరో రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొందాయి. అధికార పార్టీగా బీఆర్‌ఎస్ ఆరు డివిజన్లలో గెలుపొందినా..అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. రెండు పార్టీలూ బాగానే పుంజుకున్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. దాదాపు 65 వేల ఓట్లు ఉండటంతో అభ్యర్థుల గెలుపోటములలో వీరి పాత్ర కీలకమైంది. ఇక్కడి నుంచి రెండు సార్లు రెడ్డి సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
ఈసారి ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించినా.. ఉప్పల్‌లో మాత్రం అభ్యర్థిని మార్చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితోపాటు మాజీ మేయర్ బొంతు రమ్మోహన్, బండారు లక్ష్మారెడ్డి టికెట్ ఆశించినా..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం.. ఉప్పల్ కార్పొరేటర్ రజిత భర్త మందముళ్ల పరమేశ్వర్‌రెడ్డి అవకాశం కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పనితీరు సరిగా లేకపోవడం వల్లే మరో అభ్యర్థికి టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈసారి కాంగ్రెస్ కూడా ఉప్పల్ సెగ్మెంట్లో పాగావేయాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మూడు డివిజన్లలో రెండు ఉప్పల్ పరిధిలో ఉండటం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. ఉప్పల్ సెగ్మెంట్లో బలంగా ఉన్నామని భావిస్తున్న కాంగ్రెస్ ఈ సారి జెండా ఎగరేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన యూత్ డిక్లరేషన్‌ను జనంలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు.. ముఖ్యంగా దళితబంధులో స్థానిక ఎమ్మెల్యే 30 శాతం కమిషన్ వసూలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్.. ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుందనే దానిని బలంగా తీసుకువెళ్తున్న తమను.. అవే గట్టేక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు.
మరోవైపు కమలం పార్టీ కూడా ఉప్పల్ సెగ్మెంట్ పై ఎంతో ఆశ పెట్టుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. ఆ నమ్మకంతోనే ఈ సారి ఉప్పల్‌లో జెండా ఎగరేయడం ఖాయమంటోంది కమలం పార్టీ. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్(NVSS Prabhakar) బరిలో దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ తరపున ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటున్నారు ప్రభాకర్. కేంద్రం నుంచి 600 కోట్ల రూపాయలకుపైగా నిధులు తీసుకొచ్చి ప్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామని చెబుతున్నారు ప్రభాకర్. ఈసారి బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే ఉప్పల్‌ను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామంటున్నారు. బీఎస్పీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఈసారి గెలిస్తే ఐటీ కారిడార్ అభివృద్ధి చెందిన హైదరాబాద్ వెస్ట్‌కు దీటుగా ఈస్ట్‌లో కూడా అభివృద్ధి పరుగులు పెట్టించాలని చూస్తోంది ప్రభుత్వం. ఇదే అంశాన్ని ప్రచారం కూడా చేస్తోంది. మొత్తం మీద హైదరాబాద్ ఈస్ట్‌లోని ఉప్పల్‌లో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఒకసారి గెలిచిన పార్టీ..రెండోసారి గెలిచిన చరిత్ర లేకపోవడంతో అధికార పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఆ ఆనవాయితీకి భిన్నంగా రెండోసారి గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ సారి గెలిచి తీరుతామని బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.