మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వరదలు, సహయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోందని.. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని లేఖలో వివరించారు.
మంత్రి కేటీఆర్(Minister KTR) కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో వరదలు, సహయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి లేఖలో ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోందని.. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని లేఖలో వివరించారు. ప్రజల గోసను పట్టించుకోవాల్సిన మీరు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. పుట్టిన రోజు పండగలపై ఉన్న ఆసక్తి ప్రజల ఇబ్బందులపై లేదని అన్నారు.
విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి పోటీ పడే మీరు.. ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారు. ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు. మీ అసమర్ధ పాలనలో ఇది విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు. ట్రాఫిక్(Traffic) సమస్యలతో నగర ప్రజలు నానా యాతన పడుతున్నారని వివరించారు.
బీఆర్ఎస్(BRS) నేతల కబ్జాలు, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలతోనే నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని.. హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి రాబోతుందని మేం హెచ్చరించినా పట్టించుకోలేదని ఎండగట్టారు.
నగరంలో వరద బీభత్సం సృష్టిస్తున్నా కనీసం సమీక్ష చేసే సమయం మీకు లేదు. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్(Red Alert) ప్రకటించినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో విమర్శించారు. గతంలో వరదల సమయంలో మీరు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. అప్పట్లో ప్రకటించిన పది వేల సాయం ఎన్నికల పథకంగా మిగిలిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించాలని కోరారు. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ(GHMC) కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.