ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంత్రి కొండా సురేఖను(Konda surekha) వెనుకేసుకుని రావడమే ఆశ్చర్యం.
ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంత్రి కొండా సురేఖను(Konda surekha) వెనుకేసుకుని రావడమే ఆశ్చర్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM revanth reddy) ప్రసన్నం చేసుకోవడం కోసం, ఆయన అభినందనలను అందుకోవడం కోసం కొండా సురేఖ చాలా అతిగా మాట్లాడారు. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై(KTR) సెలబ్రిటీల వివాహేతర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్‌రెడ్డి మురిసిపోతారని సురేఖ అనుకున్నారు కాబోలు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి కూడా అప్పుడప్పుడు ఇలాంటి భాషనే మాట్లాడతారు కాబట్టి. అందుకే కేటీఆర్‌పై అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడారు. రాయడానికి వీల్లేని భాషను ఉపయోగించారు. సినీ హీరోయిన్లకు కేటీఆర్ మత్తు పదార్థాలు ఇచ్చేవారని, అలాగే రేవ్‌పార్టీలు(Rave party) నిర్వహించేవారంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచింది కదా! ఒకవేళ కేటీఆర్ అలా చేసి ఉంటే రుజువు చేసి జైల్లో తోయవచ్చు కదా! అధికారంలో ఉన్నది గుడ్డి గుర్రం పల్లు తోమేందుకు కాదు కదా! ఇప్పటికే రేవంత్‌రెడ్డి కూడా గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే కేసు పెట్టి కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే అయిపోయేది కదా! కాంగ్రెస్‌వాళ్లకు(Congress) ఈ బాధే ఉండేది కాదు కదా! ఫోన్ ట్యాపింగ్ అంటూ నానా హడావుడి చేశారు కదా! ఆ బ్యాకప్ ఫైల్స్‌లో ఇందుకు సంబంధించిన ఆడియో ఏమైనా దొరికిందా! దొరికితే ఇంతకాలం ఎందుకు గమ్మున ఉన్నారు. కేటీఆర్‌ను బొక్కలో తోసేయడానికి అదొక్కటి చాలు కదా! డ్రగ్స్ పరీక్షలకే కాదు, ఎలాంటి పరీక్షలకైనా నేను సిద్ధం అని కేటీఆర్ అన్నప్పుడు కాంగ్రెస్ పాలకులు ఎక్కడికి పోయినట్టు? అప్పుడే ఆ డ్రగ్స్ పరీక్షలు ఏవో జరిపిస్తే ఓ పని అయిపోయేది కదా! అప్పుడు వెనక్కి తగ్గి ఇప్పుడు మీడియా ముందు కంపు మాటలు మాట్లాడితే ఎలా? ట్యాపింగ్ జరిగిందని, ఇన్నాళ్లు బయటపెట్టలేదని, ఇప్పుడు పెడుతున్నాం కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కడమేమిటి? అసలు ఈ మాటలకు అర్థం పర్థం ఉందా? పదవిలో ఉన్న వారు బాధ్యతతో మెలగాలి. సురేఖ వ్యాఖ్యలు పెను దుమారం రేపి, పార్టీకి నష్టం తెచ్చేట్టుగా అనిపించడంతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్(Mahesh goud) ఆగమేఘాల మీద ఓ వీడియో చేయాల్సి వచ్చింది. కొండా సురేఖ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉప సంహరించిన కారణంగా, వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ పరిశ్రమను ఆయన వేడుకున్నారు. సురేఖ కామెంట్స్‌ను తిప్పి కొట్టడానికి టాలీవుడ్ అంతా ఏకం అవుతుందని కాంగ్రెస్ అనుకోలేదు కాబోలు.