ఏడు దశాబ్దాల హుజురాబాద్ నియోజకవర్గం(HUZURABAD CONSTITUENCY) చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలు(by-elections) రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి. రాజకీయ చైతన్యానికి వేదికైన హుజురాబాద్ నియోజకవర్గం ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.
ఏడు దశాబ్దాల హుజురాబాద్ నియోజకవర్గం(HUZURABAD CONSTITUENCY) చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలు(by-elections) రాష్ట్రం దృష్టిని ఆకర్షించాయి. రాజకీయ చైతన్యానికి వేదికైన హుజురాబాద్ నియోజకవర్గం ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ ఉద్యమమైనా, అభివృద్ధి నినాదమైనా ఆచితూచి స్పందించే ఇక్కడి ఓటరు నాడి ఎలా ఉంది? హుజరాబాద్లో ఈటలకు ప్లస్ అయిన ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా? నియోజకవర్గ చరిత్ర, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు.. ఇక్కడి ఓటర్ల చైతన్యం, వచ్చిన తీర్పులు ఏం చెబుతున్నాయి? ఇలాంటి అంశాలను మీ నియోజకవర్గం మా విశ్లేషణలో చూద్దాం..
హుజరాబాద్ అంటేనే బీఆర్ఎస్కు(BRS) కంచుకోట. ఒకప్పుడు కమలాపూర్గా(Kamalapur) ఉన్న ఈ నియోజకవర్గం తర్వాత హుజూరాబాద్‌గా మారింది. అప్పటి నుంచి ఈటల రాజేందర్(Etala Rajender) వరుసగా బీఆర్ఎస్ తరపున విజయం సాధిస్తూ వస్తున్నారు. 2022లో జరిగిన ఉప ఎన్నికలతో గులాబీ కంచుకోట బీటలువారింది. ఉద్యమంతో మొదలు అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయయాత్రకు ఉప ఎన్నికతో బ్రేక్ పడింది. నువ్వా..నేనా అన్నట్టు సాగిన ఉప ఎన్నికలో అధికార పార్టీకి చెక్ పెడుతూ హుజురాబాద్ గడ్డపై బీజేపీ(BJP) జెండా ఎగరేసింది.
ఒక్క ఉప ఎన్నిక మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. పోరాడి ఓడిన ఆ స్థానాన్ని ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్. అయితే హుజురాబాద్‌లో గెలుపు అన్ని రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు కోల్పోవద్దనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది. హుజురాబాద్‌లో బీఆర్ఎస్ తర్వాత సొంత ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్(Congress) ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి..హుజురాబాద్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో నిలిచేదెవరు? బీఆర్ఎస్ ఎవరిని పోటీకి దించబోతోంది? కౌశిక్‌రెడ్డి ఉంటారా?, గెల్లు శ్రీనివాస్‌కు మరో అవకాశం ఇస్తారా? ఈటల తప్పుకుంటే..బీజేపీ తరఫున పోటీ చేసేదెవరు? హుజురాబాద్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఉన్నారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాలు మినహా.. మొత్తం ఓటర్లంతా గ్రామీణులే. ఈ రెండు పట్టణాల్లోని ఓటర్లు గ్రామాల నుంచి వచ్చిన వారు..గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్లే అధికం. ఈ రెండు పట్టణాల్లో జరిగే వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు కూడా వ్యవసాయ, రైతు ఆధారంగా జరిగేవే. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతల్లో చాలా మందికి ఆయా ప్రభుత్వాల్లో కీలక పదవులు దక్కాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి..దాదాపు ఏడేళ్లు మంత్రిగా పని చేశారు. గతంలో ఇనుగాల పెద్దిరెడ్డి(Inugala Peddireddy), ముద్దసాని దామోదర్ రెడ్డిలాంటి(Muddasani Damodar Reddy) వాళ్లు ఇక్కడి నుంచి గెలిచి సర్కారులో కీలక మంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్, టీడీపీ(TDP), బీఆర్ఎస్తోపాటు ఇండిపెండెంట్లను కూడా ఆదరించిన నియోజకవర్గమిది. రాజకీయ పరిణతికి పెట్టింది పేరైన హుజురాబాద్ సెగ్మెంట్లో వచ్చే ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
హుజురాబాబాద్ నియోజకవర్గలో బైపోల్ ఎన్నికల జాబితా ప్రకారం మొత్తం 2 లక్షల 36 వేల 873 మంది ఓటర్లున్నారు. వీరిలో లక్షా 17 వేల 779 మంది పురుషులు, లక్షా 19 వేల 93 మంది మహిళలు, ఓ ట్రాన్స్ జెండర్ ఓటరు ఉన్నారు. మండలాల వారిగా చూస్తే.. అత్యధికంగా హుజురాబాద్ మండలంలో 61 వేల 673 మంది ఓటర్లు ఉండగా, రెండో స్థానంలో జమ్మికుంట మండలంలో 59 వేల 20 మంది, కమలాపూర్ మండలంలో 51వేల 282 మంది ఓటర్లు ఉన్నారు. నాలుగో స్థానంలో వీణవంక మండలంలో 40 వేల 99 మంది ఓటర్లు, ఇల్లందకుంట మండలంలో అతి తక్కువగా 24 వేల 799 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 64 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 2 శాతం మంది ఎస్టీలు, 8 శాతం ఓసీలు, ఇతర వర్గాలు మరో 5 శాతం ఉన్నారు. సెగ్మెంట్ లో రెడ్డి సామాజికవర్గం 22 వేల ఓట్లు, కాపు 29 వేల ఓట్లు, పద్మశాలి 28 వేలు, గౌడ వర్గం 26,000, గొల్ల కుర్మ 25 వేలు, ముదిరాజ్ 26 వేల ఓట్లు, ఎస్సీలు 46 వేలు, ఎస్టీలు 6500, ముస్లిమ్స్ 12 వేల ఓట్లున్నాయి
నియోజకవర్గం మొత్తంలో బీసీల(BC) ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. బీసీలంతా ఈటలకు మద్దతుగా ఉన్నారనే టాక్ ఉంది. అయితే ఈసారి ఓటర్లంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారనే నమ్మకంతో గులాబీ పార్టీ నేతలు ఉన్నారు. హుజూరాబాద్‌లో 17 వేల మందికిపైగా దళితబంధు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్లంతా తమ వైపే ఉంటారనే ధీమాతో ఉన్నారు. కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తే రెడ్డి సామాజికవర్గం, గెల్లు శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తే.. యాదవుల ఓట్లు పడతాయనే ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నారు. ఉప ఎన్నికలో ఈటల సెంటిమెంట్‌తో గెలిచారని, వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలవబోయేది తామేనని బీఆర్ఎస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఉప ఎన్నిక తర్వాత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ, గెల్లు శ్రీనివాస్‌కు టూరిజం, బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. ఈటలపై ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన గెల్లు శ్రీనివాస్‌కు, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి వర్గాల మధ్య పోరు సాగుతూ వచ్చింది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్‌రెడ్డి.. దూకుడు పెంచారు. ఇటీవల జమ్మికుంటలో జరిగిన భారీ సభలో మంత్రి కేటీఆర్ పరోక్షంగా కౌశిక్‌రెడ్డే ఈసారి పోటీ చేస్తారనే సంకేతాలిచ్చారు. దాంతో ఈ మధ్య నియోజకవర్గ రాజకీయాల్లో గెల్లు శ్రీనివాస్ కాస్త సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ అధిష్టానం మరోసారి తనకే అవకాశం ఇస్తుందనే నమ్మకంతో గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. ఈ టికెట్‌ని గెల్లు శ్రీనివాస్ భార్య గెల్లు శ్వేత కూడా ఆశిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ బాబుకు కూడా ఈ టికెట్ కేటాయించవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నపుడు వందల కోట్ల వ్యయంతో హుజురాబాద్ నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి పనులు చేసి ఈటల ఔరా అనిపించారు. హుజూరాబాద్‌లో జరిగిన అభివృద్ధి అంతా..తన హయాంలోనే జరిగిందంటున్నారు ఈటల రాజేందర్. ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని ఈటల విమర్శిలు చేస్తున్నారు. ఉప ఉన్నికల్లో గెలవలేదని మనసులో పెట్టుకొని తరువాత రూపాయి పనికూడా చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈటల గెలుపు తర్వాత హుజురాబాద్వైపు రాష్ట్ర నాయకులు కన్నెత్తి చూడలేదని, నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఉప ఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. అదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపరిచినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉంటుంది.
గత ఉపఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్నే.. రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. బైపోల్లో ఓడినప్పటికీ బల్మూరి వెంకట్ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, పార్టీ కార్యకర్తలతో బల్మూరి టచ్‌లో ఉంటున్నారు. అయితే గ్రేటర్‌లోని ఏదైనా నియోజకవర్గం నుంచి బల్మూరి బరిలో దిగుతారా…మరోసారి హుజూరాబాద్‌లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా అనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. అయితే హుజురాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల్లో పత్తి కృష్ణారెడ్డి, పొన్న ప్రభాకర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది పార్టీలో మార్పులు, చేర్పులు జరుగుతాయనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండానేనని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి హుజూరాబాద్‌లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణ పోటీ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికలు మాత్రం ఈటల రాజేందర్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అటు బీఆర్ఎస్కూ హుజూరాబాద్ సీటు పరువు సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని గతంలో ఈటల రాజేందర్ ఫ్రకటించడంతో రానున్న ఎన్నికల్లో బిజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. నిజంగానే ఈటల గజ్వేల్ నుంచి సీయం కేసీఆర్‌పై పోటీ చేస్తే.. ఇక్కడి నుంచి ఆయన భార్య జమున బరిలో దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా హుజూరాబాద్‌లో ఈటల విజయ పరంపరకు.. చెక్ పెట్టాలనే బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా..లేదా అన్నదే ఆసక్తిగా మారింది.