పండుగ రోజుల్లో కూరగాయల ధరలు భయపెడుతున్నాయి.
పండుగ రోజుల్లో కూరగాయల ధరలు భయపెడుతున్నాయి. మటన్(Motton), చికెన్(Chicken) ధరలు ఇప్పటికే కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు కూరగాయల వంతు వచ్చింది. అన్ని కూరగాయల ధరలు ఊహించనంతగా పెరిగాయి. బతుకమ్మ పండుగ, నవరాత్రుల సందర్భం కాబట్టి పూల ధరలు పెరిగాయంటే అర్థం ఉంది కానీ కూరగాయల(Vegitables) రేట్లు పెరగడమేమిటని సామాన్యులు గొణుక్కుంటున్నారు. టమాట సెంచరీ కొట్టేసింది. హైదరాబాద్‌లో కిలో టమాట వంద రూపాయలు ఉంది. నెల కిందట కిలో 20 రూపాయలు ఉన్న టమాట ఇప్పుడు వంద దాటడం విశేషం. ప్రస్తుతం రైతు బజార్లు, హోల్‌సేల్ షాపులలో కిలో టమాట 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతున్నది. అదే రిటైల్ మార్కెట్‌లో వంద రూపాయలకు చేరుకుంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరఫరాలో కొరత ఏర్పడిందని కూరగాయల విక్రయదారులు అంటున్నారు. రేటు పెరగడానికి ఇదో కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో ధరలు తగ్గాలి. అదేమిటో అందుకు భిన్నంగా ధరలు పెరుగుతున్నాయి.