ఓ పక్క చలి, మరోపక్క పులి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్నాయి.

ఓ పక్క చలి, మరోపక్క పులి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను వణికిస్తున్నాయి. సిర్పూర్(టి) మండటం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం స్థానికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. రెండు రోజుల వ్యవధిలోనే ఆ పులి(tiger) మూడు పశువులు, ఇద్దరు మనుషులపై దాడికి పాల్పడింది. మొన్నటికి మొన్న లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది. పులి పాదముద్రలను కెనాల్ ఏరియాలో అటవీశాఖ అధికారులు గుర్తించడంతో పులి తిరుగుతున్నదన్నది రూఢీ అయ్యింది. ఆదివారం ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు పులి కోసం వెతికారు కానీ దొరకలేదు. పులి మానటరింగ్ కోసం 10 ప్రత్యేక బృందాలను, 200 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి ఆచూకీని గుర్తించేందుకు డ్రోన్‌ను వినియోగించి మహారాష్ట్ర(Maharasta)కు రెండు కిలో మీటర్ల దూరంలో పులి ఉన్నట్టు గుర్తించారు. శుక్రవారం చేనులో పని చేస్తున్న ఓ మహిళపై పులి దాడి చేయగా ఆమె చనిపోయింది. శనివారం సురేశ్ అనే రైతుపై దాడి చేసింది. మంచిర్యాల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం బుర్కపల్లి అటవీ ప్రాంత శివారులో చిరుత పులి ఆవుపై దాడి చేసి చంపింది. బుర్కపల్లికి చెందిన రైతు రవి శనివారం ఆవును మేపేందుకు అడవి సమీపంలోకి పంపాడు. రాత్రి వరకు ఆవు తిరిగి రాకపోయేసరికి కంగారుపడ్డాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూస్తే ఆవుపై చిరుత దాడి చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చాడు. మరోవైపు ఆసిఫాబాద్(Asifabad) జిల్లాలోని 15 గ్రామాల్లో అధికారులు 163సెక్షన్ విధించారు. కవ్వాల్ అభయారణ్యంలో నాలుగేళ్లలో పులుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబర్‌లో సహజంగా మగ ఆడ పులులు జతకట్టే సమయం అని, అందులో భాగంగా పులులు సాధారణం కంటే తమ జోడు కోసం అడవిలో ఎకువ దూరం ప్రయాణం చేస్తుంటాయని అధికారులు చెప్పారు. తోడును వెతుకునే క్రమంలో పులులు చురుకుగా తిరుగుతూ ఉంటాయని, అందుకే నవంబర్,డిసెంబర్‌లో పులి దాడులు పెరుగుతున్నాయని చెబుతున్నారు అధికారులు.
