భాషలన్నింటిలోనూ మధురమైన భాష తెలుగు భాష(Telugu).
భాషలన్నింటిలోనూ మధురమైన భాష తెలుగు భాష(Telugu). మాతృభాష తెలుగుని 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా(Italian Of East) పిలుస్తారు. తెలుగు భాష.. వినడానికి వినసొంపుగా, లోతైన భావాలు కలిగి మృదుమధురంగా ఉంటుంది. అందుకే సాహిత్య పెద్దలు 'తేనెలూరే భాష తెలుగు భాష' అని కొనియాడారు. వేమన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు. వేడుక మాత్రమే కాదు ఈ రోజు వేదిక కావాలి. పవర్ రేంజర్స్,యూ ట్యూబ్ గేమ్స్, సెల్ ఫోన్స్ బదులు పంచతంత్ర కథలు, రామాయణం ,భాగవతం, పిల్లలకు కంఠతా రావడానికి ఈ రోజు వేదిక కావాలి. మన పద్యం మళ్లీ గత వైభవం సంతరించుకునేందుకు ఇదే రోజు అంకురార్పణ జరగాలి. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న జన్మించిన రామమూర్తి(Venkata Ramamurthy) తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ ప్రాథమిక విద్య అక్కడే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. గిడుగు మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి.
అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది గిడుకు రామమూర్తికి. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర - ఇంగ్లిష్ కోశాన్ని నిర్మించాడు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి కైజర్-ఇ- హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర
కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు...