తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ పోలింగ్ ముగిసింది. అయితే చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌(Telangana Assembly Elections) పోలింగ్ ముగిసింది. అయితే చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. 70.66 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల వివరాలను ఇంకా లెక్కలో చేర్చలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది.

అత్యధికంగా యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో 90.03 శాతం పోలింగ్ న‌మోద‌య్యింది. దీని త‌ర్వాత మెదక్‌(Medak) (86.69), జనగామ(Janagam) (85.74), నల్గొండ(Nalgonda) (85.49), సూర్యాపేట(Suryapet) (84.83%) జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మునుగోడు(Munugode)లో గరిష్ఠంగా 91.51 శాతం, యాకుత్‌పుర(Yakuthpura)లో అత్యల్పంగా 39.69 శాతం నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్‌ నమోదైంది. గ‌తంతో పోలిస్తే ఓటింగ్ త‌క్కువ‌గా న‌మోదైంది.

ఇదిలావుంటే.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్‌(Reddy Khanapur)లో రాత్రి 8 గంటల వరకూ.. షాద్‌నగర్‌(Shadnagar) నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూరు, తిమ్మాపూర్‌లలోని పోలింగ్‌ కేంద్రాలలో రాత్రి 8.30 దాటాక కూడా పోలింగ్‌ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 9.30 వరకు సాగింది. సాయంత్రం అయిదు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉండటంతో వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

మావోల ప్ర‌భావం ఉన్న‌ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగియగా.. అక్కడ కూడా అప్పటికే క్యూలలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కామారెడ్డి, జనగామ, ముథోల్‌, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్‌ తూర్పు తదితర నియోజకవర్గాల్లో స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించటంతో సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్‌ ఆలస్యమైంది.

Updated On 30 Nov 2023 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story