ఇవాళ్టి నుంచి దాశరథి కృష్ణమాచార్య(Dasarathi Krishnamacharya) శత జయంతి ఉత్సవాలు మొదలవుతున్నాయి.
ఇవాళ్టి నుంచి దాశరథి కృష్ణమాచార్య(Dasarathi Krishnamacharya) శత జయంతి ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఇవాళ ఆ దిగ్గజ కవి జయంతి. ఆయన సినిమా పాటలన్నీ ఆణిముత్యాలే! ఇద్దరు మిత్రులు కోసం ఆయన మొదటి సినిమా పాట రాశారు. అయితే వాగ్దానం సినిమా ముందుగా విడుదలయ్యింది. అందులో ఆయన రాసిన నా కంటి పాపలో పాట శ్రోతలను సమ్మోహితులను చేసింది. ఇక ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఖుషీ ఖుషీగా నవ్వుతూ పాట రాసిన తర్వాత సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుగారు(saluri Rajeshswar rao) దాశరథికి ఓ ట్యూన్ వినిపించారు. ఈ బాణీకి సాహిత్యాన్ని సమకూర్చడం అంత సులభం కాదన్నారు. అవునవును.. చాలా కష్టం అని చుట్టుపక్కల వారు వంతపాడారు. నిజంగానే అది టిపికల్ ట్యూన్. పైగా అది ఖవ్వాలి. వారు చెబుతున్నదంతా విన్న దాశరథి .. ఇంతకీ మీకు ఖవ్వాలే కదా కావాల్సింది అంటూ ఓ రెండు క్షణాలు ఆలోచించి వెంటనే నవ్వాలీ నవ్వాలీ నీ నవ్వులు నాకే ఇవ్వాలి అని బాణీకి తగినట్టు ఓ మాట విసిరారు. సాలూరితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. రాజేశ్వరరావు ఇచ్చిన బాణీకి ఆణిముత్యమే దొరికిందనుకున్నారు నిర్మాత, దర్శకులు. లిప్త కాలంలోనే పాట మొత్తం అల్లేశారు దాశరథి.. హైదరాబాద్ దెబ్బంటే మజాకా మరి!