2019 లోక్‌సభ ఎన్నికలను మించి ఈ ఎన్నికల్లో ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు 64.93 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికలను మించి ఈ ఎన్నికల్లో ఓట్లు పోలయ్యాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34 శాతం ఓటింగ్ జరిగింది. సాధారణ ఎన్నికల నాలుగో విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. అర్ధరాత్రికి అందిన సమాచారం ప్రకారం 64.93 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47 శాతంగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08గా నమోదైంది.