ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు తెలిపింది. పేపర్ లీకేజీతో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. నాటి నోటిఫికేషన్‌లో పోస్టులకు అదనంగా మరికొన్ని జోడించి తాజాగా మరో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 ఉంటుంది. నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు (రూ.120) నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలోనే రీఅప్లై, ఫ్రెష్ అనే వాటిని ఎంచుకొని అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి మార్చి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది.