తెలంగాణ ప్రజలకో ముఖ్య గమనిక.. దోస్తులందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం జర్రంత జాగ్రత్త.
తెలంగాణ ప్రజలకో ముఖ్య గమనిక.. దోస్తులందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం జర్రంత జాగ్రత్త. బంధువులు కలిసి సంబురం చేసుకుందామనుకున్నా ఉరుకులాడకండి.. ఒకరిద్దరు కలిసి మందు తాగితే పర్వాలేదు కానీ, సరదా పడో, ముచ్చటపడో నలుగురైదుగురు కలిసి మందు తాగకండి.. మీకే ప్రమాదం. రేవ్ పార్టీ అని బొక్కలో వేసినా వేస్తారు. అదేమిటీ ఇంతకు ముందు అలా తాగంకదా అని క్వొశ్చన్లేయకండి.. రూల్స్ మారాయి.. ట్రాన్స్‌పోర్టు మినిస్టర్ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)గారు మారిన రూల్స్‌ను వివరంగా, చక్కగా చెప్పారు. ఒకరిద్దరు కలిసి మద్యం తాగితే ఓకేనట.. ఎక్కువ మంది కలిసి తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలట! రాజ్ పాకాల ఇంట్లో మద్యం తాగడానికి అనుమతి తీసుకోలేదట! అందుకే కేసులు పెట్టారట!
మందుతాగిన వారు ఈ మాటలు వింటే మాత్రం దెబ్బకు దిగుతుంది. ఇంత బక్వాస్ రూలు ఎక్కడైనా ఉంటుందా? ప్రైవేటుగా ఇంట్లో నలుగురు కూర్చొని మందుపార్టీ పెట్టుకుంటే ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలా? అసలీ రూలు ఎప్పుడొచ్చింది? ఇలాంటి చట్టం ఉంటుందా? ఇది సాధ్యమయ్యే పనేనా? తరచూ మందుతాగేవారికైనా ఇలాంటి చట్టం ఒకటుందని ఎరుకేనా? సరే.. అలాంటి చట్టం ఉందనే అనుకుందాం! మరి ఇప్పటి వరకు ఎవరి మీదా ఎందుకు ప్రయోగించలేదనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఇక నుంచి మందు తాగేముందు రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది!