మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి జనంలోకి వస్తానంటున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి జనంలోకి వస్తానంటున్నారు. రెండు టర్మ్‌లు అధికారం చెలాయించి అది పోగానే దాదాపు ఏడాదికి పైగా ఫాంహౌస్‌కు పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు సడన్‌గా బహిరంగ సభ పెడతానడం, అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాననడం వెనుక వ్యూహం ఏంటి?అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతో కుంగిపోతున్న పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడానికా ? కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవాలనా ? లేకపోతే అనర్హత వేటు భయంతో అసెంబ్లీకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా ?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గత నెలలో తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రావడంతో గులాబీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తాజాగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తానే స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు. వరంగల్‌లో ఏప్రిల్ 27న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు.
మొత్తానికి ఏడాదికి పైగా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్(KCR) తిరిగి యాక్టివ్ అవుతాను అంటున్నారు. ప్రమాణస్వీకరం తర్వాత ఒక్కసారి బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు . ఉన్న కాసేపు ముళ్లమీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్లిపోయారు . ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచారం జరిగింది .
అయితే కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారా? లేకపోతే మళ్లీ హాజరు లెక్కలతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్(Ys Jagan) తరహాలో సభలో అలా కనిపించి ఇలా వెళ్లిపోతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రతిపక్ష నేతగా కీరోల్ పోషించాలని అటు ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి.
