Telangana DGP : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్ సమావేశమయ్యారు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ మూడు కమిషనరేట్ల పరిధిలో శాంతి భద్రతల రక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే.. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ట్రై కమిషనరేట్‌ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జన జీవనానికి విఘాతం కలిగించే చర్యలు లేదా గ్రూపులను సహించేది లేదని డీజీపీ పునరుద్ఘాటించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మానుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
అంతకుముందు.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మాటల యుద్ధంతో హైదరాబాద్‌లో నెలకొన్న హైటెన్సన్ వాతావరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని విమర్శించారు. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని డీజీపీ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో సమావేశమయ్యారు.