జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు
జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు. 2024 కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తుంది. తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాసింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నినాదం బోగస్ అని అన్నారు. ఈ బడ్జెట్ కుర్సీ బచావో బడ్జెట్ లా కనిపిస్తోంది. బీహార్, ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి 35 శాతం ఓట్లు.. 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారని గుర్తుచేశారు.
మరోవైపు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయం జరగనందున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. “‘నీతి’ లేదు.. ఇక్కడ న్యాయం జరగడం లేదు. కాబట్టి మా నాయకులు నిర్ణయం తీసుకున్నారు, ”అని శివకుమార్ విలేకరులతో అన్నారు.
కేంద్ర బడ్జెట్ 2024 వివక్షతతో కూడుకున్నదని.. తమ పార్టీ ముఖ్యమంత్రులు రాబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక మిత్రపక్షం డీఎంకే నేత ఎంకే స్టాలిన్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదని.. బడ్జెట్ ‘వివక్షాపూరితం’ అని పేర్కొన్నారు.