శనివారం మధ్యాహ్నం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి భారత ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.

Telangana Cabinet meeting cancelled due to lack of ECI’s approval
శనివారం మధ్యాహ్నం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి భారత ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఎన్నికల సంఘం అనుమతి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శనివారం సాయంత్రం వరకూ ఈసీ అనుమతి కోసం వేచిచూసినా స్పందన లేదు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి మే 27న జరగనున్న ఎన్నిక కారణంగా రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. ఎన్నికల సంఘం స్పందించలేదు.
ముఖ్యమంత్రి మినహా చాలా మంది మంత్రులు శనివారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూశారు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల సంఘం అనుమతి కోసం సోమవారం వరకు వేచి చూస్తామని మంత్రులు తెలిపారు. అప్పటికీ స్పందన రాకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమై కేబినెట్ సమావేశానికి అనుమతి కోరాలని ప్లాన్ చేశామన్నారు. వ్యవసాయ రుణాల మాఫీ, వరి సేకరణ, ఖరీఫ్ సీజన్ ప్రణాళిక, అకాల వర్షాల వల్ల పంటలు నాశనమవడంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం అవసరమని చెబుతున్నారు.
