ఒక ఉప ఎన్నిక హుజురాబాద్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆ ఎన్నికల్లో ఈటలకు ప్లస్ అయిన ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా? నిన్న మొన్నటి దాకా గులాబీ కంచుకోటగా ఉన్న హుజురాబాద్‎లో బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని ఎలాగైనా తిరిగి గెలవాలన్నది బీఆర్ఎస్ టార్గెట్.

ఒక ఉప ఎన్నిక హుజురాబాద్(Huzurabad) రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆ ఎన్నికల్లో ఈటల(Etela Rajender)కు ప్లస్ అయిన ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా? నిన్న మొన్నటి దాకా గులాబీ కంచుకోటగా ఉన్న హుజురాబాద్‎లో బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని ఎలాగైనా తిరిగి గెలవాలన్నది బీఆర్ఎస్ టార్గెట్. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవద్దనేది కమలనాథుల పట్టుదల. ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి..ఆ సీటును కబ్జా చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. హుజురాబాద్‎ సెగ్మెంట్‎లో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? ఈసారి గెలుపు జెండా ఎగరేసే పార్టీ ఏది? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

హుజురాబాద్ నియోజకవర్గం ఒక ఉప ఎన్నికతో రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‎ కంచుకోటను బద్దలు కొట్టి.. హుజురాబాద్‎ గడ్డపై బీజేపీ జెండా పాతేసింది. దీంతో ఒకే ఒక ఉప ఎన్నిక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలన్నింటినీ సమూలంగా మార్చేసింది. గత ఉప ఎన్నికల్లో స్థానికత, సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపాయి. అదే ఈటలకు బాగా కలిసొచ్చింది. ఇచ్చిన హామీలను కొన్ని అమలుపరిచినప్పటికీ డబుల్ బెడ్‎రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, పెన్షన్లు అర్హులందరికీ అందినప్పటికీ కమ్యూనిటీ పరంగా కూడా ప్రభావం చూపే అవకాశాలు నియోజకవర్గంలో ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఈటల టార్గెట్‎గా బీఆర్ఎస్ ఎత్తులు వేస్తుంటే..మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమైన ఈటల..మరోసారి హుజురాబాద్‎పై గురిపెట్టారు. ఈసారి కూడా గెలుపు తనేదేనన్న దీమాతో ఉన్నారు ఈటల.

ఒకప్పుడు కమలాపూర్‎గా ఉన్న ఈ నియోజకవర్గం..తర్వాత హుజూరాబాద్‎గా మారింది. అప్పటి నుంచి ఉద్యమ నాయకుడిగా ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ రెండోసారి పవర్‎లోకి వచ్చిన తర్వాత.. కేసీఆర్, ఈటల మధ్య గ్యాప్ పెరిగింది. అది కాస్త ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే దాకా వెళ్లింది. దాంతో 2021లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. ఫలితంగా వచ్చిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా.. విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈటల బీఆర్ఎస్‎ను వీడిన తర్వాత.. పార్టీలో విభేదాలు పెరిగాయి. ఉప ఎన్నికలో ఓటమి పాలైన గెల్లు శ్రీనివాస్‎కు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలై.. బీఆర్‎ఎస్‎లో చేరిన కౌశిక్ రెడ్డికి మధ్య పోరు సాగుతూ వచ్చింది. అయితే గెల్లు శ్రీనివాస్‎కు టూరిజం, బండ శ్రీనివాస్‎కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, కౌశిక్‎రెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఇలా చాలా మంది నేతలకు ఊహించని పదవులు దక్కడంతో ప్రస్తుతానికి నేతల మధ్య గ్యాప్ కాస్త తగ్గింది.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పై పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ ఈసారి కూడా టికెట్ ఆశించారు. ఉప ఎన్నిక తర్వాత నియోజకర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేశారు. ప్రజల్లో తిరుగుతూ వచ్చారు. అధిష్టానం మరోసారి తనకే అవకాశం ఇస్తుందనే నమ్మకంతో పార్టీ కార్యక్రమాలు చేశారు. ఈటలపై పోటీ చేసి..ఓడిపోయారన్న సానుభూతి కూడా ఉంది. కానీ ఆ మధ్య జమ్మికుంటలో జరిగిన భారీ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ పరోక్షంగా కౌశిక్‎రెడ్డే ఈసారి పోటీ చేస్తారనే సంకేతాలిచ్చారు. దాంతో.. అక్కడి నుంచి టికెట్ ఆశించిన గెల్లు శ్రీనివాస్ కాస్త సైలెంట్ అయ్యారు. అందరూ ఊహించినట్టే హుజురాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. అయితే కౌశిక్‎రెడ్డికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమకారులను పక్కన పెట్టి పారాచూట్ లీడర్ కు టికెట్ ఇవ్వడం ఏంటని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. దీంతో పార్టీ నేతలు కౌశిక్ రెడ్డి విజయానికి ఆ పార్టీ నేతలు ఏం మాత్రం సహకరిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 35 వేలకు పైనే ఓటర్లున్నారు. మండలాలవారీగా చూస్తే..హుజురాబాద్ లో 61,673, జమ్మికుంట-59,020, కమలాపూర్-51,282, వీణవంక-40,099, ఇల్లందకుంటలో 24,799 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. కులాలపరంగా ఓటర్లను చూస్తే.. ఓసీలు-23 వేలు, కాపులు-31 వేలు, గొల్లకురుమ-29 వేలు, ముదిరాజ్-30 వేలు, ఎస్సీలు-47 వేలు, ఎస్టీలు-6,500, మైనార్టీ ఓటర్లు12,300 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ బీసీలు ఈటల రాజేందర్ వైపే నిలబడ్డారు. దీంతో నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగమంతా పని చేసినా..ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే.. ఈసారి ఓటర్లంతా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారనే నమ్మకంతో ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. ఇందుకు.. హుజూరాబాద్లో 17 వేల మందికి పైగా దళితబంధు లబ్ధిదారులు ఉన్నారని.. వాళ్లంతా తమ వైపే ఉంటారనేది బీఆర్ఎస్ నేతల ధీమా. అంతేకాదు ఉప ఎన్నికల తరవాత కూడా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెబుతున్నారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. ఇక రెడ్డి సామాజికవర్గం ఓట్లు కౌశిక్‎రెడ్డికి కలిసొస్తాయనే అభిప్రాయం కూడా ఉంది. ఉప ఎన్నికలో సెంటిమెంట్ కారణంగానే ఈటల గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలవబోయేది తామేనని.. లెక్కలేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇక తన హయాంలోనే హుజూరాబాద్‎లో అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు ఈటల రాజేందర్. ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ఈటల ఈసారి హుజురాబాద్ తోపాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గత ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత..బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి మద్దతు ఇచ్చిన నేతలను ఈటల పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల బీఆర్ఎస్ ను వీడి బీజేపీ వైపు వచ్చిన నేతలు ఇప్పుడు డైలమాలోపడ్డారు. ఈటలతో కలిసిపోలేక..తిరిగి బీఆర్ఎస్ కు వెళ్లలేక చాలా నియోజకవర్గం నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం, హుజురాబాద్ నుంచి వొడితల రాజేశ్వర్‎రావు మనవడు ఒడితల ప్రణవ్‎కు టికెట్ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్‎లో ఉన్న అసంతృప్తులంతా కాంగ్రెస్‎కు మద్దతు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈసారి హుజురాబాద్ లో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం లేకపోలేదు. గత ఉపఎన్నికల్లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ కే టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరిగింది..కానీ అనూహ్యాంగా ఒడితల ప్రణవ్ కు టికెట్ కేటాయించింది.

మొత్తానికి హుజూరాబాద్ సెగ్మెంట్‎లో ఈసారి త్రిముఖ పోరు తప్పేలా లేదు. అయితే.. వచ్చే ఎన్నికలు మాత్రం ఈటల రాజేందర్ కు ప్రెస్టీజ్ ఇష్యూగా మారనున్నాయి. అదేవిధంగా.. బీఆర్ఎస్‎కు కూడా హుజూరాబాద్ సీటు పరువు సమస్యగా మారింది. హుజూరాబాద్ లో ఈటల జైత్రయాత్రకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచన చేస్తుండగా..ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఉప ఎన్నికల్లో ఈటలకు అండగా నిలబడిన హుజురాబాద్ ఓటర్లు..ఇప్పుడు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

Updated On 1 Nov 2023 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story