నిజామాబాద్ రూరల్ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. జిల్లాలోనే గులాబీ పార్టీకి కంచుకోట. ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే జాబిరెడ్డి గోవర్ధన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అయితే ఈసారి ఎలాగైనా కారు స్పీడ్‎కు బ్రేకలు వేయాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరి బాజిరెడ్డి గోవర్ధన్ ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? మరి విపక్షాల పరిస్థితి ఎలా ఉంది?. మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం. 2009లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు డిచ్‌పల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. […]

నిజామాబాద్ రూరల్ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. జిల్లాలోనే గులాబీ పార్టీకి కంచుకోట. ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే జాబిరెడ్డి గోవర్ధన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అయితే ఈసారి ఎలాగైనా కారు స్పీడ్‎కు బ్రేకలు వేయాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరి బాజిరెడ్డి గోవర్ధన్ ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? మరి విపక్షాల పరిస్థితి ఎలా ఉంది?. మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

2009లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు డిచ్‌పల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి. అవి.. నిజామాబాద్ రూరల్, జక్రాన్ పల్లి, మోపాల్, ఇందల్వాయి, సిరికొండ, డిచ్‌పల్లి, దర్పల్లి. వీటి పరిధిలో మొత్తం లక్షా 94 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ మున్నూరుకాపు సామాజికవర్గంతోపాటు దళిత, గిరిజన, ముస్లిం ఓటర్లే ఎక్కువ. మొదట్లో ఈ ప్రాంతం టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2009లో తొలిసారి పసుపు పార్టీ జెండానే ఎగిరింది. టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఇక రాష్ట్ర వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లో గులాబీ పార్టీ జెండానే ఎగురుతూ వస్తోంది. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మరోసారి బరిలో దిగుతున్నారు. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఆసక్తిరేపుతోంది. అయతే కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, క్యాడర్‌ని కలవడంతోపాటు జనంతో విస్తృతంగా మమేకం అవుతున్నారు. ఈసారి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లో మళ్లీ గులాబీ పార్టీ జెండానే ఎగురుతుందని ధీమాగా ఉన్నారు.

ఇక కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ రేగుళపల్లి భూపతిరెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2018లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన భూపతిరెడ్డి.. పోటీ చేసినా గెలుపు దక్కలేదు. ఈసారి కూడా ఆయనే బరిలో ఉండటంతో..ఈ దఫా అయినా సింపతీ పని చేస్తుందా? పాత ఫలితమే పునరావృతమవుతుందా? అనేది అర్థంకాని పరిస్థితి. ఈయన గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి.. అనర్హత వేటుకు గురయ్యారు. ఈసారి రూరల్‌లో పోటీ చేసి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. మరి ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు..భూపతిరెడ్డికి మద్దతుగా పనిచేస్తారా? లేదా? అన్నదే..ప్రస్తుతానికి సస్పెన్స్ ఉంది. ఏదేమైనా.. ఈసారి నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు ఆ పార్టీ అభ్యర్థి రేగుళపల్లి భూపతిరెడ్డి.

మరోవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మేం సైతం అంటోంది బీజేపీ. ఇక్కడ బీజేపీకి క్యాడర్ యాక్టివ్ గా కనిపిస్తున్నా..బలమైన లీడర్ లేకపోవడంతో..ఇక్కడ అంతంతమాత్రమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాషాయం పార్టీ నుంచి దినేశ్ కుమార్ కులాచారి బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఒకప్పుడు బాజిరెడ్డి గోవర్దన్‌కు శిష్యుడు కూడా. ఈసారి.. రూరల్‌లో బీజేపీనే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నిజామబాద్‌ రూరల్ నియోజక వర్గంలో మొత్తం 2 లక్షల దాకా ఓటర్లున్నారు. ఐదు మండలాల ఈ సెగ్మెంట్‌లో.. బీసీల ప్రాబల్యం ఎక్కువ. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సైతం.. భారీ సంఖ్యలోనే ఉన్నా… బీసీల్లో భాగమైన మున్నూరు కాపు ఓట్లే ఇక్కడ కీలకం. వరుస ఎన్నికల్లో గెలుపొందిన బాజిరెడ్డి గోవర్దన్‌కు.. మున్నూరుకాపులే అండగా నిలిచారన్న అభిప్రాయం స్థానిక రాజకీయాల్లో ఉంది. మరి, ఈసారి ఎన్నికల్లో మున్నూరుకాపులు ఎవరిపక్షం నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

పొలిటికల్‌ పొటెన్షియల్‌ పక్కనపెడితే.. నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు… వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ప్యాకేజీపనుల విషయంలో రైతులనుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంచిప్ప రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 3.5టీఎంసీలకు పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికోసం 1336 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, పరిహారం విషయంలోనే రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిప్ప రిజర్వాయర్‌ వల్ల… పలు గ్రామాలు, తండాలు నీటమునిగిపోనున్నాయి. దీంతో, పుట్టిన ఊరును విడిచి ఎక్కడికి వెళ్లాలని స్థానికులు అడుగుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే గోవర్దన్‌ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని విపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. డ‌బుల్ బెడ్రూం ఇళ్ళు చాలాచోట్ల పూర్తి కాకపోవడం అధికార పార్టీకి మైనస్‌గా మారింది. ఒక్క బీబీపూర్ తండాలో మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారంటున్నారు. కొన్ని చోట్ల పూర్తయినా.. మరికొన్ని చోట్ల పునాదుల దగ్గరే ఆగిపోవడంతో లబ్దిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు హామీని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. నిజాం కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని చెప్పి.. మాట తప్పారంటూ దెప్పి పొడుస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. వీటన్నింటినీ ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని విపక్షాలు యోచిస్తున్నాయి.

మొత్తానికి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికార పార్టీని వెంటాడుతున్నాయి. హ్యాట్రిక్ పై కన్నేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.. ఈ సమస్యలను ఎలా అధిగమిస్తారు? బాజిరెడ్డి గోవర్ధన్ ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? నిజామాబాద్ రూరల్ నుంచి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దిగుతున్నా..పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని జోరుగా చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

Updated On 1 Nov 2023 6:44 AM GMT
Ehatv

Ehatv

Next Story