Manakondur Assembly Constituency : రసమయి హ్యాట్రిక్ ఖాయమేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?
మానకొండూరు రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఆట, పాటల రసమయి అడ్డా మానకొండూరు. వరుసగా రెండుసార్లు ప్రత్యర్థులను మట్టికరిపించిన రసమయికి..గులాబీ కంచుకోట మానకొండూరులో ఎదురనేదే లేకుండా పోయింది. మరి.. బీఆర్ఎస్ గ్రాఫ్ ఇప్పుడు ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ కొడతారా? వరుస విజయాలతో దూకుడుమీదున్న కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేదెవరు? గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా? మానకొండూరు సెగ్మెంట్లో ఈసారి కనిపించబోయే సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం. 2009 నియోజకవర్గాల […]
మానకొండూరు రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఆట, పాటల రసమయి అడ్డా మానకొండూరు. వరుసగా రెండుసార్లు ప్రత్యర్థులను మట్టికరిపించిన రసమయికి..గులాబీ కంచుకోట మానకొండూరులో ఎదురనేదే లేకుండా పోయింది. మరి.. బీఆర్ఎస్ గ్రాఫ్ ఇప్పుడు ఎలా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ కొడతారా? వరుస విజయాలతో దూకుడుమీదున్న కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేదెవరు? గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా? మానకొండూరు సెగ్మెంట్లో ఈసారి కనిపించబోయే సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన నియోజకవర్గం మానకొండూరు. కరీంనగర్‌కు కూతవేటు దూరంలో ఉండే ఈ ప్రాంతం..రాష్ట్రం వచ్చాక.. అధికార పార్టీకి కంచుకోటగా మారింది. ఈ మానకొండూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఇక్కడ.. 2 లక్షల 11 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో.. పురుషులు లక్షా 4 వేల మందికి పైగా ఉండగా.. మహిళలు లక్షా 7 వేల మందికి పైనే ఉన్నారు. మానకొండూరు ఓటర్లలో అత్యధికంగా దళితుల ఓట్ బ్యాంక్ 35 వేలుగా ఉంది. గీత కార్మికులు 21 వేలు, మున్నూరు కాపులవి 18 వేల ఓట్లు కీలకంగా ఉన్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది మాత్రం దళితుల ఓట్లే. ఈసారి కుల సంఘాల నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఓట్లు అధికంగా ఉన్న సామాజికవర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
2009లో జరిగిన ఎన్నికల్లో మానకొండూరు నుంచి తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది. అప్పుడు హస్తం పార్టీ తరఫున ఆరెపల్లి మోహన్ విజయం సాధించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో మానకొండూరులో కారు జోరు కొనసాగింది. ఉద్యమ సమయంలో తన ఆట, పాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన రసమయి బాలకిషన్.. వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి.. మానకొండూరులో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, గెలిచిన ఆరేపల్లి మోహన్..మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆరేపల్లి మోహన్.. ఈసారి టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయికి టికెట్ ఇవ్వడంతో..ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక్కడి నుంచి కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ టికెట్ కోసం పోటీపడినా..ఆరేపల్లి మోహన్కే కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. దీంతో మానకొండూరు కాంగ్రెస్‌లో మళ్లీ జోరు కనిపిస్తోంది. ఇక..మానకొండూరు నియోజకవర్గం పరిధిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని..తనకు అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ .
ఇక..మానకొండూరులో బీజేపీ తరఫున కవ్వంపల్లి సత్యనారాయణ బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన భంగపడిన ఆయన..బీజేపీలో చేరిపోయారు. ఇక్కడి నుంచి గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న, అజయ్‌వర్మ వంటి నేతలు టికెట్ ఆశించారు. కానీ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి పార్టీలో చేరిన కవ్వంపల్లి సత్యనారాయణకు టికెట్ కేటాయించింది. ఈసారి మానకొండూరులో కాషాయం జెండా ఎగరడరం ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు.
మానకొండూరు సెగ్మెంట్లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. రసమయికి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పెండింగ్‌లో ఉండటం.. కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చానని రసమయి బాలకిషన్ చెప్పుకుంటున్నారు.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మానకొండూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉండబోతుందనేది అర్థమవుతోంది. మరి.. ముచ్చటగా మూడోసారి రసమయి బాలకిషన్‌ని గెలిపిస్తారా? లేక.. ఇతర పార్టీల అభ్యర్థులకు చాన్స్ ఇస్తారా? మానకొండూరు ఓటర్ల మనుసులో ఏముందనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.