Both Assembly Constituency : బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. బోథ్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తుందా..?
బోథ్ నియోజకవర్గం ప్రకృతి అందాలకు ఆలవాలం. రాష్ట్రంలో పేరొందిన కుంటాల జలపాతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. పొచ్చెర, గాయత్రి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ నియోజకర్గంలో చారిత్రక ఆనవాళ్లకు కొదవలేదు. కాకతీయులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మల్లికార్జున ఆలయం, కామగిరిలో ఇక్ష్వాకులు శిలాశాసనాలు, కుంటాల జలపాతంలో సోమేశ్వర స్వామి, సిరికొండ, సొనాల, దర్బా గ్రామాలు ప్రాచీన చరిత్రకు నిలయాలు. మీ నియోజకవర్గం.. మా విశ్లేషణ..! బోథ్ నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారం. పత్తి, సోయా, […]
బోథ్ నియోజకవర్గం ప్రకృతి అందాలకు ఆలవాలం. రాష్ట్రంలో పేరొందిన కుంటాల జలపాతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. పొచ్చెర, గాయత్రి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ నియోజకర్గంలో చారిత్రక ఆనవాళ్లకు కొదవలేదు. కాకతీయులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మల్లికార్జున ఆలయం, కామగిరిలో ఇక్ష్వాకులు శిలాశాసనాలు, కుంటాల జలపాతంలో సోమేశ్వర స్వామి, సిరికొండ, సొనాల, దర్బా గ్రామాలు ప్రాచీన చరిత్రకు నిలయాలు. మీ నియోజకవర్గం.. మా విశ్లేషణ..!
బోథ్ నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారం. పత్తి, సోయా, టమాట పంటలను అధికంగా ఇక్కడి రైతులు సాగు చేస్తారు. జలవనరులున్నా ప్రాజెక్టుల లేక వర్షాధారిత పంటలపైనే రైతులు ఆధారపడుతున్నారు. మత్తడివాగు, చిక్‌మాన్ ప్రాజెక్ట్, కరత్వాడ ప్రాజెక్టులే ఇక్కడ ఉన్నాయి. కుప్టి వంతెన నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెప్పినా ప్రతిపాదనలకే పరిమితమైంది.
బోథ్ నియోజకవర్గంలో 1962లో ఏర్పడింది. తొలుత జనరల్‌గా ఉన్న ఈ స్థానం 1967లో ఎస్టీకి రిజర్వ్ అయింది. బోథ్, నెరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూరు, తాంసి, తలమడుగు, సిరికొండ, భీంపూర్ మండలాలు ఉన్నాయి. సోనాలను నూతన మండలంగా ఏర్పాటు చేశారు. ఎస్టీలకు రిజర్వ్ అయినా ఈ నియోజకవర్గంలో గిరిజనేతరుల ఓట్లే కీలకం. మొత్తం 2,06,690 ఓట్లర్లు ఉండగా పురుషులు లక్షా 656 మంది, మహిళలు లక్షా 6 వేల 31 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ గెలుపొందాయి. 1967,1972,1978,1983లో వరుస విజయాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1985, 1989, 1994, 1999లో టీడీపీ పాగా వేసింది. 2004లో టీఆర్‌ఎస్ నుంచి సోయం బాపూరావు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018లో టీఆర్‌ఎస్ నుంచి రాథోడ్ బాపూరావు గెలుపొందారు.
అయితే 2023 ఎన్నికలు మలుపులు తిరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి టికెట్ వస్తుందని ధీమాగా ఉన్న బాపూరావుకు టికెట్ దక్కలేదు. వర్గపోరు, కార్యకర్తలను పట్టించుకోలేదన్న కారణాలతో బాపూరావుకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. నేరడిగొండ జెడ్పీటీసీగా ఉన్న అనిల్ జాదవ్‌కు టికెట్ ఖరారు చేసింది. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతునాని ఎమ్మెల్యే బాపూరావు మొదట్లో చెప్పినా.. కాంగ్రెస్ ఆహ్వానంతో బాపూరావు ఆ పార్టీలో చేరిపోయారు. టికెట్ ఇస్తామన్న హామీతో కాంగ్రెస్‌లో చేరినా.. వ్యూహాత్మకంగా వన్నెల అశోక్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.
ప్రస్తుత బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి భారీగా ఓట్లు రాబట్టారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 28 వేల ఓట్లకుపైగా అనిల్ జాదవ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నేరడిగొండ జెడ్పీటీసీగా అనిల్ జాదవ్ గెలుపొందారు. యువకుడు, సౌమ్యుడు అని.. మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా అనిల్ జాదవ్‌కు పేరుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావుపై అసంతృప్తి, వర్గపోరు వల్లే అధిష్టానం అనిల్ జాదవ్‌కు టికెట్ ఇచ్చారని కార్యకర్తలు అనుకుంటున్నారు. అనిల్ జాదవ్ కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్తే పక్కాగా గెలుస్తామన్న ధీమాతో బీఆర్‌ఎస్ ఉంది. ముచ్చటగా మూడో సారి బోథ్‌లో పాగా వేయాలని బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. టికెట్ రాక నిరాశతో ఉన్న బాపూరావును పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్‌లోనైనా తనకు టికెట్ వస్తుందని భావించినా.. అనూహ్యంగా వన్నెల అశోక్‌కు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమన్నది. ఎట్టి పరిస్థితుల్లో వన్నెల అశోక్‌కు మద్దతు ఇచ్చేది లేదని కొందరు నాయకులు భీష్మించుకున్నారు. ఇచ్చోడలో వన్నెల అశోక్‌కు వ్యతిరేకంగా ర్యాలీ కూడా చేపట్టారు. వన్నెల అశోక్ కచ్చితంగా ఓడిపోతాడని, బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించడానికే అశోక్‌కు టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ అసంతృప్తులు అంటున్నారు. ఆడే గజేందర్, నరేష్‌జాదవ్‌లు పార్టీ అభ్యర్థి వన్నెల అశోక్‌ను వ్యతిరేకిస్తున్నారు
వన్నెల్ అశోక్ హఠావో.. కాంగ్రెస్ బచావో అని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అసంతృప్త నేతలు. మరోవైపు టికెట్ రాక నిరాశతో ఉన్న బాపూరావు మద్దతు ఇస్తారా లేదా అని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. పార్టీ జెండా మోసినవారికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధిష్టానం అసంతృప్త నేతలను అధిష్టానం బుజ్జగించి, అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.
మరోవైపు ఈసారి ఇక్కడ పాగా వేయాలని బీజేపీ ఆశగా ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావును రంగంలోకి దించింది. జిల్లాలో గట్టి పట్టున్న నేతగా సోయం బాపూరావుకు పేరుంది. ఆ పేరుతోనే గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఆదివాసీకి చెందిన సోయంను బరిలోకి దించితే ఓట్లు రాలుతాయని బీజేపీ నమ్మకం. అయితే ఎస్టీ రిజర్వేషన్ల నుంచి లంబాడీలను తొలగించాలని గతంలో సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాపూరావు వ్యాఖ్యలపై లంబాడీలు భగ్గుమన్నారు. ఎంపీ నిధులను తన కొడుకు పెళ్లికి ఉపయోగించానని కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొత్తానికి బోథ్ నియోజకవర్గంపై పట్టుకు మూడు పార్టీలు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నాయి. మూడు పార్టీలు గట్టినేతలనే బరిలోకి దించాయని భావిస్తున్నారు ప్రజలు. బోథ్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే...!