బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ ఫిరాయింపుల పిటిషన్లపై అన్ని వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ బీఆర్ గవాయ్(BR Gawai), జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్‌ఎస్(BRS) తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం(Aryama Sundaram) కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ(telangana) అసెంబ్లీ స్పీకర్ తరపును న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi) వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రీజినబుల్ టైం ఏంటో చెప్పాలని న్యాయమూర్తులు ప్రశ్నించారు. మీ ప్రకారం సమంజమైన కాల పరిమితి అంటే ఎంత.. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదరుచూడాలా.. ఇందులో కొంత న్యాయాన్ని ఆశిస్తున్నామని న్యాయమూర్తులు అన్నారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు వ్యవహారశైలి పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ పెట్టి నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌దార్ల తరపు న్యాయవాది ఆర్యమా సుందరం జోక్యం చేసుకొని అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను వివరించారు. స్పీకర్ తరపున సీఎం ఎలా వ్యాఖ్యానిస్తారు.. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ చెప్పిన తర్వాత పిటిషన్లపై విచారణ ఎలా జరుగుతుందని మేం నమ్మాలని సుందరం అన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ''సీఎంకు కొంచెం కంట్రోల్‌లో ఉండాలి.. గతంలో కూడా ఓ సారి ఇలాగే మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. గతంలో తగిన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అని గవాయ్ అన్నారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా కోర్టుల ద్వారా స్పీకర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని సింఘ్వీ వాదించగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకొని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అని గవాయ్ వ్యాఖ్యానించారు.
