విద్యాబుద్ధులు చెప్పే ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా, అనైతికంగా ప్రవర్తించాడు.
విద్యాబుద్ధులు చెప్పే ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా, అనైతికంగా ప్రవర్తించాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయుడి వ్యవహారం మితిమీరడంతో విద్యార్థినులు విసిగిపోయారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో వారు శనివారం బడి ముందు ఆందోళన చేశారు. సోషల్ పాఠం చెప్పే ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు రెండు నెలల క్రితం బదిలీల్లో భాగంగా నిడమనూరు ఆదర్శ పాఠశాలకు వచ్చాడు. 6,7,8వ తరగతుల విద్యార్థులకు క్లాస్ తీసుకుంటున్నాడు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల మాటలతో అనుచితంగా ప్రవర్తించడం విద్యార్థినులు భరించలేకపోయారు.
అక్కడక్కడ చేతులు వేస్తూ పుట్టుమచ్చలు చూపించాలనడంతో వారు సహించలేకపోయారు. ఉపాధ్యాయుడి తీరుపై పలువురు విద్యార్ధినులు ప్రిన్సిపాల్ నిర్మలకు రెండు రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వారు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆధ్వర్యంలో పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ నిర్మల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి(kandukur jayaver reddy) మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి విషయాన్ని తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేశారు. ఘటనపై విచారణ జరపాలని కలెక్టర్‌తోపాటు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజును ఆదేశించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటున్నాడు ఆంజనేయులు. చనువుగా ఉండటం వల్ల విద్యార్థినులు అపార్థం చేసుకున్నారని, సబ్జెక్టు కాని విషయాలను విద్యార్థినులతో చర్చించలేదని అంటున్నాడు.