ఓ కుమారుడు తన తండ్రిని బాగానే చూసుకుంటున్నాడు. కానీ కొడుకు మనసులో ఉన్న విషయాన్ని తండ్రి గ్రహించలేకపోయాడు.
ఓ కుమారుడు తన తండ్రిని బాగానే చూసుకుంటున్నాడు. కానీ కొడుకు మనసులో ఉన్న విషయాన్ని తండ్రి గ్రహించలేకపోయాడు. కొడుకు బాగానే చూసుకుంటున్నాడని తండ్రి కూడా నమ్మాడు. తీరా ఆస్తి రాసిచ్చిన తర్వాత తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. తండ్రిపై దాడికి దిగాడు. ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన తండ్రిని కాపాడిన స్థానికులు.. కొన్నాళ్ల తర్వాత కొంత మంది సలహాతో కొడుక్కే షాక్ ఇచ్చాడు తండ్రి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామంలో జరిగింది.
తహశీల్దార్ ప్రవీణ్‌కుమార్ వివరాలు వెల్లడించిన ప్రకారం.. ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్యకు ఐదెకరాల పొలం ఉంది. ఆ పొలంలో 4 ఎకరాల 12 గుంటల భూమిని తన కుమారుడు మద్దెల రవికి గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేశాడు. పొలం ఇవ్వకముందు బాగానే ఉన్న కొడుకు.. ఆ తర్వాత తన నిజరూపాన్ని బయటపెట్టసాగాడు. తండ్రిపై దాడి చెసి ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో కొమురయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న గొర్రెల కాపర్లు గమనించి అతన్ని రక్షించారు. ఓ నెల రోజుల తర్వాత కొడుకు చేసిన పని గురించి చెప్పాడు. దీంతో ధైర్యం చెప్పి పంపించారు. హుజూరాబాద్‌లోని ఓ రైస్ మిల్లుకు గేట్ కీపర్‌గా పనికి కుదిరాడు. కొమురయ్య గురించి తెలుసుకున్న కొంత మంది వ్యక్తులు సీనియర్ సిటిజన్ యాక్ట్ వివరించారు. దీంతో కొమురయ్య ఆర్డీవోను కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. ఆర్డీవో వెంటనే మద్దెల రవి పేరుతో ఉన్న పొలం రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసి కొమురయ్య పేరుమీదకు మార్చాడు. పేరు మార్పిడి పట్టా పాస్ పుస్తకాన్ని స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ రాజ కొమురయ్యకు ఇచ్చారు. తనకు సహకరించిన స్థానికులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు కొమురయ్య. కుక్క కాటుకు చెప్ప దెబ్బలా కొడుక్కు తగిన శాస్త్రి జరిగిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.