రైతులను, ప్రజలను హోల్ సేల్ గా మోసం చేశారని.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రైతులను, ప్రజలను హోల్ సేల్ గా మోసం చేశారని.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పథకాలు రైతుబంధు, రైతుభీమా అని పేర్కొన్నారు. రైతులపై కేసీఆర్ నిబద్దతను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నది ఎవరు? రైతులకు ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్తే రైతులే చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పాలనతో భీడువడ్డ తెలంగాణను పచ్చబడేలా చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకి రైతుల కష్టాలు పెరుగుతున్నాయని.. రైతు ఆత్మహత్యలు బాగా పెరిగాయని.. వ్యవసాయ పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. అన్నదాతల ఆవేదన, ఆక్రందన భిన్న రూపాల్లో వ్యక్త పరుస్తున్నారని తెలిపారు.
రైతులు కంటతడి పెడుతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటు వేశామని బాధ పడుతున్నారని.. కాంగ్రెస్ నాయకులు రైతులను పట్టించుకోకుండా ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే ఉన్న పనిలో ఉన్నారని విమర్శించారు. ఎంత సేపు అధికారం, రాజకీయం తప్ప జనాన్ని, రైతులను పట్టించుకునే పని లేదు కాంగ్రెస్ నేతలకు అని దుయ్యబట్టారు.
పాలన చేతనైతే రైతుల వద్దకు వెళ్లి దైర్యం చెప్పండి.. నీళ్లివ్వండని అన్నారు. వచ్చే ప్రభుత్వం ఇంత హోల్ సేల్ గా మోసం చేస్తారు అని జనం అనుకోలేదన్నారు. మంత్రి తుమ్మల కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నాడని.. ఆయనంటే సోదరభావం ఉంది. కొంత గౌరవం ఉంది.. గతంలో మీరు మంత్రి గా ఉన్నప్పుడు వ్యవసాయ పరిస్థితులు ఏంటో తెలియదా.? అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసం నింపాం.. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి రైతులు తల్లడిల్లుతున్నారని.. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. పంటలకు మంట పెట్టుకున్న ఒక్క రైతునయినా ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. రైతాంగానికి ధైర్యం ఇచ్చే సత్తాలేని పిరికివాళ్లు కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు అని ధ్వజమెత్తారు.
రైతులు నిలదీస్తారనే క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదన్నారు. తుమ్మల పరిస్థితి చూస్తే జాలివేస్తున్నది .. గతానికి, ఇప్పటికి ఉన్న తేడా తెలియడం లేదా.. కేసీఆర్ పాలనకు మించి మంచి చేస్తే హర్షిస్తాం .. యాసంగి పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇప్పించండని డిమాండ్ చేశారు.
గోదావరి బేసిన్ లో నీళ్లున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రోజూ నాలుగు వేల క్యూసెక్కులు వృధాగా పోతున్నా నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ప్రాజెక్టుల మీద అవగాహన లేదు .. నీటిని మళ్లించుకునే ఆలోచన లేదని పరిస్థితిని ఎండగట్టారు. అమావాస్య తర్వాత పౌర్ణమి ఉంటుందని విషయాన్ని కాంగ్రెస్ నేతలు, మంత్రులు గుర్తుంచుకోవాలన్నారు.
గోదావరి నీళ్లను సహేతుకంగా వాడాలని సూచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారు అంటున్న మంత్రి తుమ్మల.. ప్రకృతి విపత్తుతోనే మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగాయి అన్న విషయం తెలియదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే గోదావరి నీళ్లను ఎత్తిపోయడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే వరకు పోరాటం చేస్తామన్నారు. వ్యవసాయానికి, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.