తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ. చూస్తుండగానే ఎనిమిదిరోజుల వేడుకలు ముగిసి.. తొమ్మిదో రోజుకి చేరుకున్నాము..తొమ్మిదో రోజు బతుకమ్మను పెద్ద బతుకమ్మ అనీ.. సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) అని అంటారు. పెద్ద బతుకమ్మ కోసం ఒక రోజు ముందుగానే గడ్డి పువ్వు, గునుగుపువ్వు తెచ్చి తగినట్టుగా కోసి కట్టలు కట్టి పెట్టుకుంటారు. కొంతమందైతే.. అర్ధరాత్రి వెళ్లి తంగెడు చెట్టు దగ్గరే పడుకుంటారు. రాత్రి నుంచే పువ్వుల కోసం పోటీ పడతారు. గంపల్లో బస్తాల్లో పూలు నింపుకొస్తారు. కాస్త పొద్దు పొడిచాక.. బతుకమ్మను తీర్చిదిద్దడం మొదలవుతుంది. ఇంట్లో వున్న వాళ్లంతా తలో చేయి వేస్తారు. ఆడామగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పువ్వలేరుతారు. పెద్ద పెద్ద బతుకమ్మలను సాధారణంగా మగవాళ్లే పేరుస్తారు. ముక్కాలి పీట, దాని మీద పెద్ద తాంబాలం. దాని మీద గుమ్మడి ఆకులు పరచి తంగెడు పూలు పేరుస్తారు. తంగెడు పువ్వుతోనే బతుకమ్మ ఎత్తు పెంచుతారు. నడుమ ఉనుకనో, తంగెడు తుక్కునో నింపుతారు. రంగుల్లో అద్దిన గునుగుపూల కట్టలను వలయాకారంలో పేరుస్తూ వస్తారు. బతుకమ్మకు ఒకటా రెండా … అన్ని పువ్వులూ అలంకరణలవుతాయి. రోకలి బండ పువ్వు, అడవి శాకుంతి, కట్లె పువ్వు, గోరింట, గన్నేరు పూలు ఒద్దికగా ఒదిగిపోతాయి. బతుకమ్మను పేర్చడమయ్యాక పసుపు గౌరమ్మను తీర్చుతారు . ఇంట్లో అలికి ముగ్గు పెడతారు. దాని మీద పీట పెట్టి అందులో బతుకమ్మను పెడతారు. ఆడవాళ్లు వరి, సజ్జ రొట్టెలను ముక్కలు చేసి చక్కెర పాకంలో వేసి ముద్దలు చేస్తారు. వీటినే మలీద ముద్దలని, కులీదలని అంటారు. రకరకాల సద్దులు చేస్తారు. పులుసు కలిపిన సద్ది, పెరుగు కలిపిన సద్ది చేస్తారు. కాస్త కలిగిన వాళ్లు పెసర, కొబ్బరి, నువ్వుల, పల్లీల బియ్యం పొడులు లకిపి తయారు చేసిన తొమ్మది రకాల సద్దులు బతుకమ్మ ముందు పెడతారు. అగరు వత్తులు ముట్టించి బతుకమ్మ పూల మధ్యలో చెక్కుతారు. పూజ చేస్తారు. కొత్త చీరలు కట్టుకొని తయారైన స్ర్తీలు బతుకమ్మను ఇంటి ముందు పెట్టి ఆడతారు. వంటలు సమర్పిస్తారు. మొక్కుతారు. సాయంత్రం నుంచి చీకట్లు ముసురుకొనే వరకు అడవాళ్లంతా తనివి తీరా ఆడతారు. ఆ తర్వాత తమ్మలి వాద్య సహకారంతో బతుకమ్మలు తలల మీద ఊరేగుతాయి. అంతకు ముందే బతుకమ్మలను వదలడానికి యువకులు పెద్దలు చెరువు కట్ట పొడుగునా బారులు తీరి వుంటారు. సందె చీకట్ల మధ్య చెరువులోని నీటి అలల మీద బతులకమ్మలు తేలియాడుతూ ముందుకు వెనక్కి కదులుతుంటూ అదో ఉద్వేగం. పోయిరా బతుకమ్మ పోయికరావమ్మ మల్లొచ్చే యాడాది తిరిగి రావమ్మా అంటూ ...శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ పాటలు పాడుతారు. తెచ్చిన ప్రసాదాలు, ఫలహారాలు తబుకుల్లో పోసి ఒక్క దగ్గర అందరూ కూడతారు. గుంపులు గుంపులుగా కలిపి మరింత సందడిగా తుళ్లుతూ పరాచికాలాడుతూ పరవశించిపోతారు. ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఒకరినొకరు ఇష్టపూర్వకంగా పలకరించుకుంటారు. ఆడపిల్లలాడుకునే అందమైన, అద్భుతమైన పూల జాతర మరెక్కడా కనిపించదు. కేరళలో ఓనం పండుగ అటుఇటుగా ఇలాగే వుంటుంది. అక్కడ కూడా రంగు రంగుల పూలతో చిత్రించిన రంగవల్లిక, మధ్యలో వెలుగులు విరజిమ్మే దీపం, చూట్టూ చేరి ఆటపాటలాడే అమ్మాయిలు. పాటల్లో ఎక్కువగా పురాణ కథలే వుంటాయి. ఈ రెండు సందర్భాలు మినహాయిస్తే పూల సమ్మేళనంతో కూడిన పండుగలు ప్రపంచంలో మరో చోట కనిపించవు. అదే బతుకమ్మ ప్రత్యేకత.

బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. . రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి.

ehatv

ehatv

Next Story