Revanth Reddy : ఆ కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలిపోయింది
జోగు రామన్న(Jogu Ramanna) నీతిమంతుడైతే కేసీఆర్(KCR) ఎందుకు ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు.? మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా..
జోగు రామన్న(Jogu Ramanna) నీతిమంతుడైతే కేసీఆర్(KCR) ఎందుకు ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారు.? మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని టీపీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా.. తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదు.. నిధులు రాలేదు.. నియామకాలు జరగలేదన్నారు.
కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం పగిలిపోయిందన్నారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే.. పదేళ్లయినా యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోగు రామన్నకు.. జోకుడు రామన్నాకు తేడా లేదన్నారు. రాష్ట్రంలో జోగు రామన్నలాంటి పిల్ల రాక్షసులకు గురువు బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అని అన్నారు. ఆ బ్రహ్మరాక్షసుడిని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలకు ఏమీ చేయని బీఆర్ఎస్ కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. దొరల తెలంగాణ కావాలో ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోండన్నారు.
బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోదీ.. నిన్న మెడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా.. మోదీ తెలంగాణకు వచ్చి తొండను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.
టికెట్ రానివారు వాడో వీడో చెబితే వినొద్దన్నారు. టికెట్ రానివారికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎవరూ భావోద్వేగానికి లోను కావద్దు.. క్షనికావేశానికి గురికావద్దని నాయకులకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఎవరు వస్తారో రండి.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే మేం నామినేషన్లు వేయం అని సవాల్ విసిరారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగుతాం.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి.. ఈ సవాల్ కు బీఆర్ఎస్ సిద్ధమా..? అని సభాముఖంగా అడిగారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.. కాంగ్రెస్ వస్తుంది.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందన్నారు.