యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలో ఈ నాలుగు అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత, స్థానిక ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలపై చార్జిషీట్, కాంగ్రెస్ ప్రధాన హామీల ప్రస్తావన, స్థానికంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవడం.. ఈ నాలుగు అంశాలు ప్రధాన అస్త్రాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలను సన్నద్దం చేస్తున్నారు. […]

యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలో ఈ నాలుగు అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత, స్థానిక ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలపై చార్జిషీట్, కాంగ్రెస్ ప్రధాన హామీల ప్రస్తావన, స్థానికంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవడం.. ఈ నాలుగు అంశాలు ప్రధాన అస్త్రాలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలను సన్నద్దం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బలోపేతంపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో రేవంత్ రెడ్డి ప్రత్యకంగా సమావేశం అవుతున్నాడు. ఎన్నికలకు సిద్దమవడం, పార్టీని గ్రామ స్థాయి నుండి పటిష్టపరచడంపై కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నాడు. అంతేకాదు రేవంత్ పాదయాత్రలో ఆ నియోజకవర్గానికి చెందిన అన్ని స్థాయిల నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అంతా పాల్గొనేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటోంది.

స్థానిక బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు చార్జిషీట్ విడుదల చేస్తోంది. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. చార్జీషీట్ లో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు చేస్తోంది. ఈ చార్జ్ షీట్ పత్రాలను నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు పంచడంతో పాటు, సోషల్ మీడియాలో సైతం కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ చార్జిషీట్ పై బీఆర్ఎస్ నేతలు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.

పాదయాత్రలో నడిచేటప్పుడు రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలుసుకునేందుకు, సమావేశమయ్యేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో సమావేశం, హుజురాబాద్ లో నిరుద్యోగులను కలవడం, సిరిసిల్లలో చేనేత కార్మికులు.. ఇలా వీలైనన్ని ఎక్కువ వర్గాలతో సమావేశమవుతున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయా వర్గాలను కోరుతున్నాడు. మహిళా సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు, స్థానికంగా వివిధ సామాజిక వర్గాల ప్రతినిధుల నుండి వచ్చే వినతి పత్రాలను సైతం రేవంత్ రెడ్డి స్వీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని భరోసానిస్తున్నారు.

పాదయాత్ర అనంతరం ప్రతిరోజు సాయంత్రం జరిగే కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతులు, మహిళలు, యువత, ఇళ్లు లేని పేదల లక్ష్యంగా రేవంత్ రెడ్డి హామీలు ఇస్తున్నాడు. రూ.400 కే గ్యాస్ సిలిండర్, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఇండ్లు లేని పేదలకు రూ.5 లక్షల రూపాయలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగనే ఈ నాలుగు హామీలను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నాడు. మరో పది నెలల్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ నాలుగంచెల వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని సిద్దం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.

Updated On 7 March 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story