హైదరాబాద్‌లో(Hyderabad) ప్రస్తుతం ఫ్లెక్సీల(Flexi) గోల నడుస్తోంది.

హైదరాబాద్‌లో(Hyderabad) ప్రస్తుతం ఫ్లెక్సీల(Flexi) గోల నడుస్తోంది. గత నెలలో చంద్రబాబు(Chandrababu), రేవంత్‌రెడ్డి(Revanth) సమావేశం సందర్భంగా చంద్రబాబు వచ్చినప్పుడు బేగంపేట నుంచి చంద్రబాబు ఇంటి వరకు అడుగడుగునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు మెరిసిపోయాయి. ఓ సందర్భంలో ఓ ఫ్లెక్సీ కూలిపోతే ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు స్వయానా వారి చేతులతోనే కూలిపోయిన ఫ్లెక్సీని యథాస్థానంలో ఉంచడం సోషల్‌ మీడియాలో చూశాం. వైఎస్‌ జయంతి సందర్భంగా కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలు చాలా చోట్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాదు ప్రధాన పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు కూడా వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి(tirupati reddy) జన్మదినం సందర్భంగా ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో 'మాట తప్పని మహనీయుడు, శత్రువులేని నాయకుడు, అలుపెరగని ప్రజాసేవకుడు' అనే ట్యాగ్‌లైన్లు కూడా రాశారు. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. గత నెలలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఇలాగే పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గంట వ్యవధిలో నిబంధనల పేరుతో తొలగించారు. దీనిపై అప్పుడు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు ఫ్లెక్సీలను దగ్గర ఉండి ఏర్పాటు చేసిన పోలీసులు, కేటీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించడమేంటని ప్రశ్నించారు. ఈరోజు కూడా సోషల్‌ మీడియాలో, పలు వేదికల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇదే ప్రశ్నలేవనెత్తుతున్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు నగరమంతా పెడితే జీహెచ్‌ఎంసీ అధికారులకు నిబంధనలు ఎందుకు గుర్తుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్‌కు ఓ న్యాయం, తిరుపతిరెడ్డికో న్యాయమా అని అడుగుతున్నారు. కనీసం వార్డు మెంబర్‌ కూడా కాని తిరుపతిరెడ్డి అలుపెరుగని ప్రజాసేవకుడు అని ఇంత పెద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే అధికారులకు కనపడడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో పోస్టులు పెడుతూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story